అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రోజుకో కీలక మలుపు చోటుచేసుకుంటోంది. ఇటీవల కమలా హ్యారిస్తో డిబేట్కు రెడీ అని చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. వచ్చే నెల 4న ఫాక్స్ న్యూస్ ఛానెల్ ఆతిథ్యంలో డిబేట్‌లో పాల్గొందామంటూ కమలా హ్యారిస్కు ప్రతిపాదించారు. అయితే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తిరస్కరించారు.
జో బైడెన్ డెమోక్రాట్ల అభ్యర్థిగా ఉన్నప్పుడు కుదిరిన అంగీకారం ప్రకారమే సెప్టెంబరు 10న ఏబీసీ న్యూస్ ఆతిథ్యంలో డిబేట్ జరపాలని.. దానికే తాను హాజరవుతానని ఆమె స్పష్టం చేశారు. ఎప్పుడైనాసరే.. ఎక్కడైనాసరే.. అని గతంలో అన్న వ్యక్తి ఇప్పుడు నిర్దిష్ట తేదీన.. నిర్దిష్ట సురక్షిత ప్రాంతంలో.. అని ప్రతిపాదిస్తుండటం విచిత్రంగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ట్రంప్ కొత్త ప్రతిపాదన తనకు అంగీకారం కాదని.. సెప్టెంబరు 10న డిబేట్‌లో పాల్గొనేందుకు ట్రంప్ ముందుగా అంగీకరించారని.. తాను అదే తేదీన వస్తానని కమలా హ్యారిస్ ఎక్స్ వేదికగా ఈ వ్యవహారంపై స్పందించారు.