రష్యా నుంచి నార్త్ కొరియాకు కిమ్​ తిరుగు ప్రయాణం.. కానుకలుగా డ్రోన్లు, బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కోటు

-

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రష్యా పర్యటన ముగిసింది. ఆరు రోజుల పాటు రష్యాలో పర్యటించిన కిమ్​.. ఆదివారం రోజున స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. ఆయన తాను వచ్చిన రైలులోనే స్వదేశానికి వెళ్లారు. ఉత్తరకొరియా సరిహద్దుకు సమీపంలోని ఆర్టెమ్‌ నగరంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో రష్యా మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంగళవారం రోజున రైలు మార్గం ద్వారా రష్యాలోకి ప్రవేశించిన కిమ్‌.. అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కిమ్‌కు ప్రిమోర్‌ ప్రాంత గవర్నర్‌.. ఐదు ఆత్మాహుతి డ్రోన్లు, ఒక నిఘా డ్రోన్‌, ఒక బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కోటు బహుమతులుగా ఇచ్చారు. అంతర్జాతీయంగా భయాందోళనలు రేకెత్తించిన కిమ్ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఆయుధ ఒప్పందాలు జరుగుతాయని అమెరికా, దక్షిణ కొరియా, ఇతర పశ్చిమ దేశాలు భయపడ్డాయి. ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాకు ఉత్తరకొరియా మందుగుండు సామగ్రి.. అందుకు ప్రతిగా ఆ దేశానికి అణుసామర్థ్యం పెంచుకొనే సాంకేతికతను మాస్కో బదిలీ చేయొచ్చన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే అధికారికంగా ఎలాంటి ఒప్పందాలను ఇరు దేశాలు ప్రకటించకపోవడంతో ప్రపంచం ఊపిరిపీల్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news