ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఫోకస్ అంతా క్షిపణి పరీక్షలు, సైనిక సమీక్షలపైనే ఉంది. దేశం తీవ్ర ఆహార సంక్షోభంలో ఉన్నా.. ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నా.. కిమ్ మాత్రం పక్క దేశాలపై దాడుల గురించే ఆలోచిస్తున్నారు. తాజాగా దేశంలోని ఆయుధ కర్మాగారాలు, అణ్వాస్త్రాలను మోసుకుపోయే సామర్థ్యమున్న క్షిపణి ఇంజిన్ల తయారీ కేంద్రాల్లో పర్యటించారు.
అమెరికాతోపాటు దక్షిణ కొరియాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో ఆయుధ కర్మాగారాల్లో కిమ్ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యూహాత్మక క్రూజ్ క్షిపణి ఇంజిన్ల తయారీ కేంద్రంతోపాటు ఇతర ఆయుధ కర్మాగారాలు, మానవరహిత గగనతల వాహనాలు (యూఏవీలు), భారీ రాకెట్ లాంచర్లకు అవసరమైన పనిముట్ల తయారీ కేంద్రాలను వరుసగా మూడు రోజులపాటు కిమ్ జోంగ్ ఉన్ సందర్శించినట్లు అక్కడి అధికారిక మీడియా కేసీఎన్‌ఏ తెలిపింది. ఈ సందర్భంగా వివిధ ఆయుధ కర్మాగారాల్లో రైఫిళ్ల పనితీరును కిమ్ స్వయంగా పరిశీలించిన ఫొటోలను ఆ దేశ మీడియా విడుదల చేసింది.