మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 60పైగా స్థానాలను కైవసం చేసుకుంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. మాల్దీవుల పార్లమెంటు (పీపుల్స్ మజ్లీస్) లోని 93 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ జరిగింది.
ముయిజ్జుకు చెందిన పీఎన్సీ, ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ) సహా ఆరు పార్టీలకు చెందిన 368 మంది బరిలో నిలవగా.. 86 నియోజకవర్గాల ఫలితాలను ప్రకటించారు. అందులో 60కి పైగా స్థానాలను పీఎన్సీ దక్కించుకుంది. మెజార్టీకి అవసరమైన సీట్లను ఆ పార్టీ ఇప్పటికే గెల్చుకోవడంతో ఈ పార్టీ గెలుపు ఖాయమైంది.
ప్రధాన ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ 89 స్థానాల్లో పోటీ చేసి 12 చోట్ల గెలుపొందింది. మరో 10స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. మాలే పట్టణంతోపాటు అడ్డు, ఫువాముల్లా పట్టణాల్లోని మెజారిటీ స్థానాలను మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు నేతృత్వంలోని పీఎన్సీ కైవసం చేసుకుంది. తాము ఈ ఫలితాలను ఊహించలేదని ప్రతిపక్ష మాల్దీవుల డెమోక్రాటిక్ పార్టీ పేర్కొంది.