యుద్ధం ఎంత వినాశకరమో, దాని పరిణామాలెంత భీకరంగా ఉంటాయో చెప్పడానికి దక్షిణ గాజాలోని రఫాలో జరిగిన దాడులే నిదర్శనం. శనివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడుల్లో దంపతులు, వారి ముద్దుల చిన్నారి మృతి చెందారు. నిండు గర్భిణిగా ఉన్న మహిళ మృత దేహాన్ని రఫాలోని కువైట్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసి గర్భంలోంచి పసికందును సురక్షితంగా బయటికి తీశారు. ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఏడు నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇలాంటి విషాదకర ఘటనలెన్నో ఉన్నాయి.
ఈజిప్టు సరిహద్దుల్లోని ఈ నగరంపై దాడి చేయొద్దని గత కొంతకాలంగా అమెరికా, ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూనే ఉన్నా… టెల్‌అవీవ్ ఖాతరు చేయకుండా రఫాపై దాడులు ప్రారంభించింది. శనివారం రాత్రి జరిగిన మరో సంఘటనలో ఏకంగా 17 మంది చిన్నారులు ఇజ్రాయెల్ బాంబులకు బలైపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ఇద్దరు మహిళలూ ప్రాణాలు కోల్పోయారు.