ఆయనకే నా ఓటు.. ఎట్టకేలకు ‘ట్రంప్’కు నిక్కీ హేలీ మద్దతు

-

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌నకు గట్టి పోటీనిచ్చిన నిక్కీ హేలీ రెండు నెలల క్రితం అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఎట్టకేలకు ట్రంప్నకు మద్దతు పలికారు. రాబోయే ఎన్నికల్లో తాను ఆయనకే ఓటేస్తానని ప్రకటించారు. ‘హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వాషింగ్టన్‌’లో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిక్కీ ఈ ప్రకటన చేశారు.

అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలగిన అనంతరం నిక్కీ హేలీ ట్రంప్‌నకు బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ విషయంలో ఇప్పటి వరకు ఆమె మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె ఈ విషయంలో మౌనంగా ఉండటంతో.. నిక్కీ మద్దతుదారులంతా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడే ప్రమాదం ఉందని రిపబ్లికన్‌ వర్గాలు అనుమానిస్తూ వచ్చాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ రిపబ్లికన్‌ పార్టీ ఏకతాటిపై ఉందన్న సందేశాన్ని హేలీ పంపారు. అభ్యర్థిత్వ రేసులో ఉన్న సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరి ఓట్లను ట్రంప్‌ తనవైపు తిప్పుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news