ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కు నియంత అనే పేరుంది. ఆయన తీసుకునే నిర్ణయాలు.. ఆయన వ్యవహార శైలి డిక్టేటర్ను తలపిస్తాయి. కఠిన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలను నిత్యం భయంగుప్పిట్లో ఉంచుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే అలాంటి డిక్టేటర్లో ఇటీవల కాస్త మార్పు కనిపిస్తోందట. కిమ్ వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ఇటీవల ఉత్తర కొరియాలోని పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకోగా…స్వయంగా వెళ్లి కిమ్ సహాయక చర్యల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన వరదల్లో నిరాశ్రయులైన బాధితుల్ని పరామర్శించారు. సహాయక శిబిరాలకు వెళ్లి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. అంతే కాకుండా పలువురు బాధితుల వద్దకు వెళ్లిన కిమ్ వారిని ఆప్యాయంగా పలకరించిన ఫొటోలను ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ-KCNA విడుదల చేసింది. వరద బాధితులకు అవసరమైన ఆహార సామగ్రిని అందించారు. చైనాతో సరిహద్దు ఉన్న ఉత్తరకొరియా ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి 4 వేల100 ఇళ్లు ధ్వంసమైన విషయం తెలిసిందే.