థాయ్‌లాండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెర దించుతూ ఆ దేశ పార్లమెంటు శుక్రవారం రోజున నూతన ప్రధాన మంత్రిని ఎన్నుకుంది. ఎన్నికలు లేకుండానే మాజీ ప్రధాని తక్సిన్ షినవత్ర కుమార్తె పేటోంగ్టార్న్ (37)ను కొత్త పీఎంగా ఎన్నుకుంది. ఆమెకు పార్లమెంటులోని దిగువసభ ఏకగీవ్రంగా మద్దతు తెలిపింది.
సభలో 247 మంది సభ్యుల మెజారిటీ అవసరం ఉండగా.. 11 పార్టీల సంకీర్ణానికి నేతృత్వం వహిస్తున్న ఫ్యూ థాయి పార్టీ అగ్రనేత పేటోంగ్టార్న్‌కు 314 మంది మద్దతు ప్రకటించారు. దీంతో ప్రధాన మంత్రిగా పేటోంగ్టార్న్ ఎన్నిక ఏకగ్రీవమైంది. థాయ్‌లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా పేటోంగ్టార్న్ గుర్తింపు పొందారు. గతంలో ఆమె తండ్రి తక్సిన్ షినవత్ర ప్రధానిగా కొనసాగారు. 2006లో సైనిక తిరుగుబాటుతో ఆయన పదవి కోల్పోయారు. 2011 – 14 మధ్య కాలంలో పేటోంగ్టార్న్ మేనత్త (తక్సిన్ సోదరి) యింగ్లక్ షినవత్ర ప్రధానిగా ఉన్నారు. ఇక షినవత్ర కుటుంబానికే చెందిన మూడో వ్యక్తిగా పేటోంగ్టార్న్ మళ్లీ అధికార పగ్గాలు దక్కించుకోవడం గమనార్హం.