తోషాఖానా కేసులో దోషిగా తేలిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అటక్ జైలులో మూడేళ్ల శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే జైల్లో వసతులపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మూడో తరగతి ఖైదీలను ఉంచే గదిలో తనను ఉంచారని, పురుగులు ఇబ్బంది పెడుతున్నాయని తనను కలవడానికి వచ్చిన న్యాయవాది నయీమ్ హైదర్‌కు ఇమ్రాన్ తెలిపారు. ఆ జైల్లో తాను ఉండలేకపోతున్నానని.. ఎలాగైనా ఇక్కడి నుంచి తనను బయటికి తీసుకెళ్లాలని ఇమ్రాన్ కోరినట్లు పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) వర్గాలు తెలిపాయి.
అటక్ జైలు నుంచి తమ నాయకుడిని సౌకర్యాలు మెరుగ్గా ఉండే అదియాల్ జైలుకు తరలించమని పీటీఐ ఇప్పటికే ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇమ్రాన్ న్యాయవాదుల బృందం కూడా జైల్లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇమ్రాన్ మానసిక స్థైర్యం కోల్పోలేదని.. ఎన్నేళ్లు తనను జైలులో ఉంచినా.. ఉండటానికి సిద్ధమని తెలిపారని పేర్కొంది. మరోవైపు తన శిక్షను సస్పెండ్ చేయాలంటూ ఇమ్రాన్ వేసిన పిటిషన్‌పై తక్షణ ఊరట ఇచ్చేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసుపై నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.