పాకిస్తాన్ లో రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు నేడు సమావేశం అయిన జాతీయ అసెంబ్లీ ఇప్పటి వరకు అవిశ్వాసంపై ఓటింగ్ జరపలేదు. ఉద్దేశ పూర్వకంగా ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ అవిశ్వాసంపై ఓటింగ్ ను ఆలస్యం చేయాలని చూస్తోందని ప్రతిపక్ష పార్టీ అధినేత బిలావల్ బుట్టో ఆరోపిస్తున్నారు. ఇది కోర్ట్ ధిక్కరణ కిందకే వస్తుందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. అయితే ఈ రోజు రాత్రి 8 గంటల తరువాత అవిశ్వాసంపై ఓటింగ్ జరిగే అవకాశం ఉందని పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే శనివారం రాత్రి 9 గంటలకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అత్యవసర క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దాదాపుగా పడిపోవడం ఖాయం అయినట్లు తెలుస్తోంది. తాజాగా పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ చౌదరి ఫవాద్ హుస్సేన్ తన ట్విట్టర్ ఖాతాలో మాజీ మంత్రి అని స్టేటస్ చేంజ్ చేశాడు. దీంతో ఇక ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని తెలుస్తోంది.