హంగ్ దిశగా పాక్​!.. ఇంకా వెల్లడి కాని ఫలితాలు

-

పాకిస్థాన్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఆ దేశంలో రెండు ప్రధాన పార్టీలు తమదే విజయమంటూ ప్రకటించుకున్నా, ఎన్నికల సంఘం మాత్రం ఇంకా ఫలితాలు వెల్లడించలేదు. బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే హంగ్‌ ఏర్పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. జాతీయ అసెంబ్లీలో అత్యధిక సీట్లను ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు సొంతం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండో స్థానంలో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌)- పీఎంఎల్‌(ఎన్‌) నిలిచే అవకాశం ఉంది.

నాలుగోసారి ప్రధాని పదవిని అధిష్ఠించాలనుకుంటున్న నవాజ్‌ షరీఫ్‌, బిలావల్‌ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పీపీపీతో కూటమి కట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు ముందుకు రావాలంటూ వివిధ రాజకీయ పక్షాలకు షరీఫ్‌ పిలుపునిచ్చారు. అయితే, ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ మాత్రం తాము ఎవరితోనూ జత కట్టబోమని, సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version