ఉక్రెయిన్-రష్యాల యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓ వైపు రష్యా ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్ కూడా తామేం తీసిపోమంటూ రష్యాపై తిరగబడుతోంది. ఇప్పటికే పలుమార్లు మాస్కోపై డ్రోన్ దాడులు చేసింది. ఏకంగా ఇటీవల కెర్చ్ జలసంధిలోని రష్యా చమురు నౌకపై దాడి చేసింది ఉక్రెయిన్. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని రష్యా సమయం కోసం వేచి చూసింది.
తాజాగా శనివారం రాత్రి నుంచి రష్యా పశ్చిమ ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. ఏకంగా 70 డ్రోన్లను పంపింది. క్షిపణుల వర్షం కురిపించింది. మూడు విడతలుగా జరిగిన ఈ దాడుల్లో ఆరుగురు ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారు. కీవ్, ఖార్కివ్ నగరాలు.. దొనెట్స్క్ ప్రాంతం.. బాంబుల మోతతో అట్టుడికిపోయాయి. మరోవైపు మాస్కోను మళ్లీ ఉక్రెయిన్ డ్రోన్ వణికించింది. అయితే ఆ డ్రోన్‌ను రష్యా నేల కూల్చింది. డ్రోన్ల దాడి భయంతో వినుకోవా విమానాశ్రయంలో విమాన రాకపోకలను రష్యా.. ఆదివారం రోజున తాత్కాలికంగా నిలిపివేసింది. ఇరు దేశాల యుద్ధంతో ఇప్పటికే రెండు దేశాలకు చెందిన చాలా మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.