ఎప్పటికైనా తైవాన్ చైనాలో భాగమవ్వాల్సిందేనని డ్రాగన్ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్ అన్నారు. చైనాను పాలించిన మావో 130వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తైవాన్ తమ దేశంలో విలీనంకాక తప్పదని వ్యాఖ్యానించారు. జనవరిలో ఈ ద్వీపంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో జిన్‌పింగ్ నుంచి ఇటువంటి స్పందన రావడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మాతృభూమితో పునరేకీకరణ జరగడం అనివార్యమని, తైవాన్‌ను చైనా నుంచి వేరు కానీయమని ఈ సందర్భంగా జిన్పింగ్ అన్నారు. తైవాన్ జలసంధి అంతటా శాంతియుత సంబంధాలను ప్రోత్సహించాలని ప్రతిజ్ఞ చేశారు.
చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న తైవాన్ వచ్చే ఏడాది జనవరి 13వ తేదీ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. డెమొక్రాటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ నేత లయ్ చింగ్-టే ఈ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు అంచనాలున్నాయని అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. మరోవైపు తైవాన్‌లో ఎన్నికలు తమ అంతర్గత వ్యవహారమని చైనా వాదిస్తోంది. తన విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రతిసారి తైవాన్ మీదకు యుద్ధవిమానాలు, నౌకలను పంపి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.