అమెరికాలోని టెక్సాస్లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. పాన్‌హ్యాండిల్ వద్ద కార్చిచ్చులు అత్యంత తీవ్ర రూపం దాల్చడంతో భారీ నష్టం వాటిల్లింది. అతి పెద్దదైన ది స్మోక్ హౌస్ క్రీక్ కారణంగా ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల ఎకరాల్లో ఉన్న చెట్లు, పొలాలు, గృహాలు దగ్ధమయ్యాయి. ఇవాళ కూడా పొడి వాతావరణం కొనసాగనుండటంతో ఇది ఆగే పరిస్థితి లేదని స్థానిక అధికారులు తెలిపారు. ఈ అగ్ని కీలలు ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపించడం గమనార్హం.
గురువారం సాయంత్రం నాటికి పొరుగు రాష్ట్రమైన ఓక్లహామాలో కూడా మరో 31,500 ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. అక్కడ కూడా అత్యవసర పరిస్థితి విధించారు. టెక్సాస్ చుట్టుపక్కల వ్యాపించిన మొత్తం కార్చిచ్చులు కలిపి 2,000 చదరపు కిలోమీటర్ల మేర భస్మం చేశాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు స్మోక్ హౌస్ క్రీక్ కార్చిచ్చు వల్ల ఇద్దరు మరణించినట్చలు వెల్లడించారు. మరోవైపు మంటలు వ్యాపించిన ప్రాంతంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు నార్త్ పవర్ ఎలక్ట్రిక్ కో-ఆపరేటివ్ సంస్థ ప్రకటించింది.