ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్య అధిక బరువు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి ఇలా దీనికి బోలెడు కారణాలు. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఊబకాయం తో బాధపడేవారి సంఖ్య ఏకంగా 100 కోట్లు దాటిందట. ఈ విషయాన్ని ‘ది లాన్సెంట్ జర్నల్’ కథనం వెల్లడించింది. ఊబకాయంతో బాధపడుతున్న వారిలో పెద్దలేగాక, పిల్లలు, యువకులూ ఉన్నారట.
సాధారణంగా పోషకాహార లోపం ఉన్నప్పుడు తక్కువు బరువు లేదా ఊబకాయానికి దారి తీస్తుంది. అయితే, 1990 నుంచి తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఈ అధ్యయనం వెల్లడించింది. చాలా దేశాల్లో పోషకాహార లోపంతో ఊబకాయం రావడం అనేది సాధారణ సమస్యగా మారిపోయిందని తెలిపింది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా అధిక బరువుతో బాధపడుతున్నట్లు లాన్సెంట్ అధ్యయనంలో తేలింది. వీరిలో 15.9కోట్ల మంది చిన్నారులు, యువకులు కాగా.. 87.9 కోట్ల మంది పెద్దలు ఉన్నట్లు పేర్కొంది.