కాలిపోతున్న కాలిఫోర్నియా అడవులు .. 2రోజుల్లోనే విధ్వంసం

-

అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున అటవీ సంపద దహించుకుపోతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతుండటం.. అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లైంది. ఈ ఏడాది సంభవించిన అతిపెద్ద కార్చిచ్చు ఇదేనని అధికారులు చెబుతున్నారు. ఉత్తర కాలిఫోర్నియాలోని క్లామాథ్ నేషనల్ ఫారెస్ట్​లో మంటలు అదుపు చేయలేని రీతిలో చెలరేగుతున్నాయని అటవీ అధికారులు తెలిపారు.
‘అడవిలో చెట్లు ఎండిపోయాయి. చిన్న నిప్పురవ్వ పడగానే అంటుకుంటున్నాయి’ అని అమెరికా పారెస్ట్ సర్వీస్ ప్రతినిధి అడ్రియెనే ఫ్రీమన్ పేర్కొన్నారు. భారీగా వీస్తున్న గాలులు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయని అన్నారు. రెండు రోజుల్లోనే 207 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయని స్థానిక అధికారులు తెలిపారు. సిస్కియూ కౌంటీలో జనావాసాలు లేని ప్రాంతంలో మంటలు ప్రారంభమయ్యాయని చెప్పారు.

కార్చిచ్చుకు గల కారణాలు తెలియలేదని అధికారులు చెబుతున్నారు. కాలిఫోర్నియా హైవే 96’కు ఇరువైపులా ఉన్న చెట్లన్నీ కాలిపోయాయని వెల్లడించారు. అనేక వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయని తెలిపారు. ఆస్తినష్టం ఎంత అయిందనే విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదని అధికారులు చెప్పారు. మంటలు ఇప్పటికీ ఇంకా అదుపులోకి రాలేదన్నారు.
కార్చిచ్చు నేపథ్యంలో కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ విధించారు అక్కడి గవర్నర్ గావిన్ న్యూసమ్. పర్యావరణ మార్పులే ఈ బీభత్సానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడిచిన 30ఏళ్లలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయని, ఆ ఫలితంగానే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news