టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన సబ్ మెరైన్ కథ విషాదాంతమైంది. ఐదుగురు పర్యటకులతో వెళ్లి.. గల్లంతైన మినీ జలాంతర్గామి ‘టైటాన్’ తీవ్రమైన ఒత్తిడి పెరగడం వల్ల పేలిపోయి అందులో ఉన్న ఐదుగురు పర్యటకులు మరణించారని అమెరికా కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వాహనం సహాయంతో మినీ సబ్‌మెరైన్ శకలాలను గుర్తించామని.. టైటానిక్ ఓడ సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ మినీ సబ్‌మెరైన్ శకలాలను గుర్తించినట్లు పేర్కొంది.
ఈ విషయాన్ని వెంటనే బాధితుల కుటుంబాలకు తెలియజేసినట్లు రియర్ అడ్మిరల్ జాన్ మౌగర్ తెలిపారు. యూఎస్ కోస్ట్ గార్డ్, రెస్య్కూ సిబ్బంది తరఫున మృతులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అంతకు ముందు టైటాన్ మినీ సబ్‌మెరైన్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నట్లు ఓషన్ గేట్ సంస్థ పేర్కొంది.
అట్లాంటిక్ మహాసముద్రంలో 12 వేల అడుగుల లోతులోని టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో మినీ సబ్‌మెరైన్ టైటాన్ గత ఆదివారం న్యూఫౌండ్‌ల్యాండ్ నుంచి బయలుదేరింది. మూడు రోజుల నుంచి వీరి ఆచూకీ గల్లంతవ్వడంతో కెనడా, అమెరికా తీర రక్షక దళాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. ఇక తాజాగా సబ్‌మెరైన్ పేలి అందులోని వారంతా చనిపోయినట్లు తెలిసింది.