చైనాలో ఇన్ఫెక్షన్ కేసులు రోజురోజుకు పెరగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా అప్రమత్తమైన భారత్ ఆరు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తాజాగా అమెరికా కూడా అప్రమత్తమవుతోంది. డ్రాగన్ దేశంలో ఇన్ఫెక్షన్ కేసులు రోజురోజుకు పెరుగుతుడటంతో.. తక్షణమే అమెరికా, చైనా మధ్య ప్రయాణాలపై నిషేధం విధించాలని కోరుతూ అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌కు రిపబ్లికన్ సెనెటర్లు లేఖ రాశారు.
చైనాలో శ్వాసకోశ వ్యాధి వేగంగా వ్యాప్తిస్తున్నా.. ఆ దేశం ప్రజా ఆరోగ్య సంక్షోభంపై స్పష్టమైన సమాచారాన్ని అందించదన్న విషయం తెలిసిందేనని సెనెటర్లు లేఖలో పేర్కొన్నారు. దీనిపై డబ్ల్యూహెచ్‌వో చర్యలు తీసుకునేదాకా ఎదురుచూడకూడకుండా.. అమెరికన్ల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు తక్షణమే ఇరు దేశాల మధ్య ప్రయాణాలపై నిషేధం విధించాలని కోరారు. ఈ కొత్త వ్యాధి గురించి పూర్తిగా తెలిసేదాకా ఈ ఆంక్షలు కొనసాగాలి అని రిపబ్లికన్ సెనెటర్లు ఆ లేఖలో కోరారు. చైనాలో నిమోనియా వ్యాప్తి తర్వాత అమెరికాలో ఇటీవల కొత్త రకం శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో సెనెటర్లు లేఖ రాసినట్లు సమాచారం.