దక్షిణ కొరియా గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. తాజాగా చెంగ్జూలోని నాలుగు లైన్ల రహదారి కింద ఉన్న గంగ్‌ప్యోంగ్ సొరంగంలోకి వరద నీరు ప్రవేశించడతో 12 కార్లు, ఒక బస్సు సహా 15 వాహనాలు చిక్కుకుపోయాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే బస్సులో నుంచి ఏడు మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు.
అండర్‌పాస్ వరదలో చిక్కుకుపోయినవారిని కాపాడేందుకు 400 మంది సహాయక సిబ్బంది, డైవర్లు రంగంలో దిగారు. ఇప్పటివరకు 9మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. 11మంది గల్లంతైనట్లు చెప్పారు. వారికోసం గాలింపుచర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
శనివారం ఈ నగరంలో భారీ వర్షాలు పడటంతో సమీపంలోని మిహోవ్ నది కట్టలు తెంచుకుని నగరంలోకి ప్రవేశించింది. వరద వేగంగా సొరంగంలోకి చేరడంతో వాహనాల్లో ఉన్నవారు తప్పించుకొనే అవకాశం కూడా లభించలేదని అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలకు….కొండచరియలు విరిగిపడటంతోపాటు ఇండ్లు దెబ్బతిన్నాయి. వేర్వేరు ఘటనల్లో 33మంది చనిపోగా….వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.