చైనాలో టోర్నడో బీభత్సం.. వీడియో వైరల్‌

-

ఇటీవలే వర్షాలతో వణికిపోయిన చైనా దేశాన్ని ఇప్పుడు టోర్నడో బెంబేలెత్తిస్తోంది. డ్రాగన్ దేశంలో ఓ టోర్నడో తాజాగా బీభత్సం సృష్టించింది. ప్రకృతి సృష్టించిన ఈ విధ్వంసం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రగాయాల పాలయ్యారు. స్థానిక మీడియా తెలిపిన ప్రకారం జియాంగ్స్‌ ప్రావిన్స్‌లోని సుకియాన్‌ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం టోర్నడో ఒక్కసారిగా విరుచుకుపడింది. నెమ్మదిగా ప్రారంభమైన సుడిగాలి క్షణాల్లోనే వేగాన్ని అందుకొని ఒక్కసారిగా పట్టణాన్ని చుట్టేసింది. భారీ శబ్దంతో పాటు వీచిన గాలికి ఇళ్ల పైకప్పులు గాలిలోకి ఎగిరాయి.

ఒక్కసారిగా వచ్చిన ఈ విలయాన్ని చూసి స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే సగం ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరికొన్ని ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి పలువురు గాయపడ్డారు. ఈ సుడిగాలి ధాటికి 137 ఇళ్లు నేలమట్టం కాగా, 5,500 మంది ప్రజలు తీవ్ర ప్రభావితమయ్యారు. 400 మంది వారి నివాసాలను ఖాళీ చేసి వెళ్లారు. టోర్నడో విధ్వంసం అనంతరం వాహనాలు ఎక్కడికక్కడ చెల్లచెదురుగా పడ్డాయి. ఈ విధ్వంసానికి సంబంధించిన పలు దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news