ప్రచారంలో వివేక్ రామస్వామి జోరు.. ఆరు రోజుల్లో 42 ఈవెంట్లు

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి ప్రచారంలో తన జోరు సాగిస్తున్నారు. మొదటి నుంచీ అమెరికన్ల ప్రయోజనాలే ముఖ్యమని చెబుతూ తాను అధ్యక్షుడినైతే అమెరికాకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చే విధానాలు అమలు చేస్తానో బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఆయన ప్రసంగాలకు అమెరికన్లు ఫిదా అవుతూ మద్దతిస్తున్నారు. ప్రచారంలో దూకుడు మీదున్న వివేక్.. ఆరు రోజుల్లో ఏకంగా 42 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ‘యూఎస్‌ఏ టుడే’ సంస్థ తెలిపింది. వచ్చే వారం కూడా 38 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు పేర్కొంది. ప్రచారంలో మిగతా అభ్యర్థుల కంటే వివేక్ రామస్వామి ముందంజలో ఉన్నట్లు వెల్లడించింది.

తన ప్రచారాలకు వస్తున్న ఆదరణపై వివేక్ రామస్వామి స్పందిస్తూ ఈ ఆదరణ చూస్తుంటే తనకు ఎంతో ఎనర్జీ వస్తోందని అన్నారు. దేశం పట్ల వారికున్న శ్రద్ధే తనను ప్రోత్సహిస్తోందని తెలిపారు. విరాళాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం కంటే పిజ్జా ఔట్లెట్స్లో ప్రజలతో సంభాషించడం మేలని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నిక్లలో అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సహా ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. వారిలో భారతీయ అమెరికన్లు వివేక్‌ రామస్వామి, నిక్కీ హేలీతోపాటు ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డీశాంటిస్‌ , న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ కూడా పోటీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news