నా పాపులారిటీని తట్టుకోలేకపోతున్నారు.. ప్రత్యర్థులపై వివేక్ రామస్వామి ఫైర్

అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న రిపబ్లికన్‌ పార్టీ నేత, భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తన ప్రసంగాలతో అమెరికన్ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మరోవైపు పలువురు ప్రముఖుల మద్దతు కూడా మూటగట్టుకుంటున్నారు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఉంటే సపోర్ట్ చేస్తాను అంటూనే.. ఆయణ్ను తలదన్నేలా ప్రచారంలో సాగిపోతున్నారు. అయితే తాజాగా ఆయన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు.

‘నాకు పెరుగుతున్న పాపులారిటీని నా ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. 38 ఏళ్ల చిన్న వయసు వ్యక్తికి  అధ్యక్ష పదవిని నిర్వహించే అనుభవం ఉండదని వారు భావిస్తున్నారు. ఇటీవల చర్చా కార్యక్రమంలో నేను మెరుగైన ప్రదర్శన చూపినప్పటి నుంచి విమర్శలు ఎక్కువయ్యాయి. ఇదంతా ఎన్నికల ప్రక్రియలో భాగం. స్వాతంత్య్రం గురించి యూఎస్‌ డిక్లరేషన్‌ను రాసినప్పుడు థామస్ జెఫర్సన్ వయసు 33 ఏళ్లే. అలాంటి స్ఫూర్తిని తిరిగి తీసుకురావాల్సి ఉంది’ అని వివేక్ అన్నారు.