తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదని అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి బిక్ష కాదు.. పోరాడి సాధించుకున్నామని పేర్కొన్నారు. కెసిఆర్ ఆమరణ దీక్షకు దిగివచ్చి, తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన కాంగ్రెస్ ఆంధ్ర లాభికి, ఒత్తిళ్లకు తలొగ్గి ఇచ్చిన తెలంగాణని వెనక్కి తీసుకుందన్నారు. తెలంగాణ పోరాటాలను కాంగ్రెస్ పదేపదే అవమానిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ చేసిన కాలయాపన ఫలితంగా నే తెలంగాణలో ఆత్మబలిదానాలు జరిగాయని విమర్శించారు.
తెలంగాణలో అధికారం కోసమే అమలుకు సాధ్యం కానీ హామీలను కాంగ్రెస్ ఇస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ – బిజెపిలకు ప్రస్థానం లేదని స్పష్టం చేశారు. 48 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వివక్ష, అసమానతల ఫలితమే తెలంగాణలో దుర్భిక్షమని వెల్లడించారు. ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ కి తెలంగాణలో ప్రజలు ఓటు రూపంతో బుద్ధి చెప్పాలన్నారు. ఒంటె పెదవులకు నక్క ఆశ పడ్డట్లు అలవిగాని హామీలు ప్రజల ముందు పెట్టి అధికారం కోసం కాంగ్రెస్ ఆరాటపడుతుందని విమర్శించారు.