రోమన్ కాథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఇవాళ (ఏప్రిల్ 21న) తుదిశ్యాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన అంత్యక్రియలపై చర్చ జరుగుతోంది. సాధారణంగా పోప్ అంతిమ సంస్కారాలు సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. కానీ తాను బతికున్నప్పుడే తన అంత్యక్రియలు ఎలా జరపాలో పోప్ ఫ్రాన్సిస్ సూచించారట. గతంలో మూడు అంచెలున్న శవపేటికలలో పోప్ ను ఖననం చేసే ఆచారం ఉండేది. సింపుల్‌గా ఉండే.. చెక్క శవపేటికలో తన పార్థివదేహాన్ని ఉంచాలని ఇటీవల ఆయన కోరారట.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పార్థివదేహాన్ని ఉంచేందుకు జింక్ ఖనిజ పట్టీతో శవపేటికను సిద్ధం చేయనున్నారు. మరోవైపు వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో ఎత్తుగా ఉండే కాటాఫల్క్ ప్రదేశంలో ప్రజల సందర్శనార్థం పోప్ ఫ్రాన్సిస్ పార్థివదేహాన్ని ఉంచుతారు. రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చిలో పోప్ ఫ్రాన్సిస్‌ను ఖననం చేయనున్నారు. వాటికన్ సిటీ కాకుండా మరో ప్రదేశంలో రోమన్ క్యాథలిక్ చర్చి మత పెద్దను ఖననం చేయడం ఈ శతాబ్ధ కాలంలో ఇదే మొదటిసారి.