మనుషుల్లో చాలా రకాల వాళ్ళు ఉంటారు. అందులో ఒకరు ఇంట్రావర్ట్స్. అంటే ఎక్కువగా మాట్లాడకుండా తమ పని తాము చేసుకునేవారు. ఎవరి జోలికి వెళ్ళకుండా తమకు కావల్సిన దాన్ని తీసుకుంటూ జీవితాన్ని గడిపేస్తారు. సాధారణంగా వీళ్ళు ఎక్కువగా మాట్లాడరు. దానివల్ల పక్కనుండేవారు వీరిని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఐతే అది వీరి లక్షణమే కానీ, బలహీనత కాదు. ఇంట్రావర్ట్స్ చేసే కొన్ని పనులని సమాజం తప్పుగా అర్థం చేసుకుంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సిగ్గు
అందరి ముందు మాట్లాడడానికి సిగ్గు పడతారని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నిజంగా మాట్లాడాల్సిన సందర్భమే వస్తే వీరంత బాగా ఎవరూ మాట్లాడరు. కానీ అన్ని విషయాల్లో అలా మాట్లాడలేరు. ముందుగానే చెప్పినట్టు తమకి అవసరమైన వాటికి మాత్రమే మాట్లాడతారు. చాలా మంది దీన్నే సిగ్గని అనుకుంటారు. కొంతమంది భయం అని కూడా అనుకుంటారు. ఎక్కువగా మాట్లాడరు కానీ అది భయం కాదు.
ఫ్రెండ్స్ ఉన్నా కూడా వారి పరిధి తక్కువగానే ఉంటుంది. అన్ని విషయాలని పంచుకోవాలని అనుకోరు. చాలా తక్కువ విషయాలని మాత్రమే తక్కువ మందితో పంచుకుంటారు. దీన్నే కొంతమంది ఇంట్రావర్ట్స్ కి స్నేహం చేయరాదని భావిస్తారు. స్నేహమంటే బాధల్ని పంచుకోవడం అని వారికి తెలుసు. అందుకే అవతలి వారి బాధల్ని వినడానికి రెడీగా ఉంటారు.
ఎక్కువ సేపు ఒంటరిగా ఉండడానికే చూస్తారు. ఏకాంతం వీరి ఆస్తి. ఒక్కరే ఎంతసేపైనా మాట్లాడుకుంటారు. తమకి కష్టం వచ్చినా ఒక్కరే బాధపడతారు. ఎవ్వర్నీ దానికి కారణంగా చూపాలని అనుకోరు. ఎవరి దగ్గరకెళ్ళి ఓదార్పు కోరుకోరు. వీళ్ళకి ఓదార్చడం కూడా తెలియదు. అవతలి వారి బాధని తగ్గించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓదార్చడం తెలియదు.