వడ్డీ రేట్లలో కోత వల్ల పెట్టుబడులు పెరిగే అవకాశాల్లేవని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ రజనీష్ కుమార్ మంగళవారం తెలిపారు. ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ 47వ జాతీయ నిర్వహణ సదస్సులో మాట్లాడిన ఆయన, మూలధన వ్యయం సాధారణ స్థాయిలో ఉన్నందున ప్రస్తుత సంవత్సరం రుణ వృద్ధి మందగించిందని రజనీష్ వెల్లడించారు. 2008 నాటి సంక్షోభ సమయంలో బ్యాంకులు నిబంధనలను పలుచన చేయడం వల్ల రుణాలు భారీగా పెరిగాయని, దానివల్ల అధికంగా చెల్లించాల్సి వచ్చిందని, ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్యాంకులు వివేకంతో వ్యవహరిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించడానికి మౌలిక సదుపాయాల వ్యయం ఒక మార్గమని ఎస్‌బీఐ ఛైర్మన్ సూచించారు. భారత్‌లో రూ. 10 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పైప్‌లైన్ ఉందని, ఇది ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేయగలదని తెలిపారు. ఎందుకంటే నిర్మాణ రంగం ఉద్యోగాలను, డిమాండ్‌ను సృష్టించగలదని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు.