ఏపీలో ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు జగన్‌కు జై కొట్టారు. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక్కగానొక్క జనసేన ఎమ్మెల్యే జగన్ కి జై కొట్టారు. జగన్ వీరిని నేరుగా తన పార్టీలో చేర్చుకోకపోయినా పరోక్షంగా వీరంతా వైసీపీ ఎమ్మెల్యేలుగానే ఉండనున్నారు. ఇక ఎవరు టీడీపీని వీడినా నేరుగా వైసీపీ కండువా కప్పుకోకుండా తమ అనుచరులకో, వారసులకు జగన్ సమక్షంలో కండువాలు కప్పించుకుని.. వారు పరోక్షంగా వైసీపీ ఎమ్మెల్యేలుగానే ఉండనున్నారు. అయితే మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.
గంటా సైకిల్ దిగడంతో పాటు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. గంటా వైసీపీకి పరోక్షంగా సహకరించకుండా రాజీనామా చేసి మళ్లీ ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసి గెలవడంతో పాటు వచ్చే యేడాది జరిగే ప్రక్షాళనలో మళ్లీ మంత్రి పదవి దక్కించుకోవాలన్న కుతూహలంతో ఉన్నాడట. తనతో పాటు తన అనుచరగణాన్ని మొత్తం వైసీపీలో చేర్పించడంతో పాటు ప్రతిష్టాత్మకమైన విశాఖ గ్రేటర్ పీఠంపై వైసీపీ జెండా ఎగరవేయించేలా చేయడంతో పాటు తాను నార్త్‌లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటాలన్నదే ఆయన ప్లాన్.
ఆ తర్వాత జగన్‌ను డిమాండ్ చేసి మరీ మంత్రి పదవి సొంతం చేసుకునే స్కెచ్ గంటా వేస్తున్నట్టు విశాఖ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిచ్చేలా ఉన్నాయి. జగన్ ముందు కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయని.. జగన్ తీసుకునే నిర్ణయం మేరకే గంటా వైసీపీ ఎంట్రీ ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఇక గంటా కూడా పార్టీ మారేందుకు సిద్ధమైపోవడంతో పాటు తన అనుచరగణంతో చర్చలు జరుపుతున్నారు.
గంటా పార్టీ మారితే తిరుపతి ఎంపీ సీటుతో పాటు విశాఖ నార్త్ సీటుకు కూడా ఉప ఎన్నిక జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అభివృద్ధి పనులతో పాటు విశాఖ రాజధాని విషయం తనకు ప్లస్ అవుతుందన్న ధీమాతోనే గంటా రాజీనామాకు రెడీ అవుతున్నారని టాక్?
-vuyyuru subhash