డ్రోన్లను కూల్చేసిన ఇరాన్‌!.. ఇజ్రాయెల్‌ ‘నో కామెంట్స్‌’

-

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇరాన్‌లో ఇవాళ తెల్లవారుజామున పలు చోట్ల పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఇవి ఇజ్రాయెల్‌  ప్రతీకార దాడులేనని అమెరికా చెబుతుండగా.. వీటిని ధ్రువీకరించేందుకు మాత్రం ఇజ్రాయెల్‌ నిరాకరించింది. అయితే తమ గగనతలంలోకి చొచ్చుకొచ్చిన పలు డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ వెల్లడించింది.

ఇరాన్‌లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో ఈరోజు వేకువజామున భారీ పేలుడు శబ్దాలు వినిపించడంతో అధికారులు వెంటనే తమ గగనతల రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. ఇప్పటి వరకు మూడు డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. అయితే, ప్రస్తుతానికి క్షిపణి దాడులు జరిగినట్లు ఆధారాల్లేవని జాతీయ సైబర్‌ స్పేస్‌ సెంటర్‌ అధికార ప్రతినిధి హొస్సేన్‌ డల్లిరియాన్‌ సోషల్‌ మీడియాలో తెలిపారు.

ఇరాన్‌లో పేలుళ్లు ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులేనని అమెరికా అంటోంది. అయితే  దీనిపై స్పందించేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం నిరాకరించింది. ‘ప్రస్తుతానికి మేం ఏం మాట్లాడలేం’’ అని పేర్కొనడం గమనార్హం. రానున్న 24-48 గంటల మధ్యలో ఇరాన్‌పై దాడి చేస్తామని ఇజ్రాయెల్ సూచనప్రాయంగా అగ్రరాజ్యానికి చెప్పినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news