తెలంగాణ ప్రభుత్వం శ్రామికుల బాధలు పట్టించుకోవడం లేదు : ఈటల రాజేందర్

-

తెలంగాణ ప్రభుత్వం శ్రామికుల బాధలు పట్టించుకోవడం లేదని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తాజాగా మల్కాజ్‌గిరి బైక్ మెకానిక్స్ అసోసియేషన్ మెంబర్లతో ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ..బీఆర్‌ఎస్ పార్టీకి గానీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇక్కడ సమస్యలపై అవగాహన లేదు. మనం ఓటు వేస్తున్నామంటే మన ప్రాంత అభివృద్ధి కోసం, సమస్యలు తీర్చడం కోసం కృషి చేయాలని కోరుకుంటాం. కానీ ఈ పార్టీ అభ్యర్థులు మనకు పరిచయమే లేదు. వారికి మన బాధల పట్ల ఏమాత్రం పట్టింపు లేదు. కాబట్టి వారికి ఓటు వేయాలో, వద్దో ప్రజలే నిర్ణయించాలి.

తెలంగాణ పట్ల, ఇక్కడి ప్రజల పట్ల నాకున్నంత పట్టింపు ఇంకెవరికీ లేదని కేసీఆర్ చెప్తుండేవాడు. వారి ఎంపీలను గెలిపిస్తే వారు లోక్‌సభలో కొట్లాడుతారని చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి కాలేకపోయాడు. కాబట్టి ఆపార్టీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లి ఏం చేయగలరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే వారి ద్వారా రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని, అప్పుడు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయగలమని చెప్తున్నాడు. ఇది సాధ్యమయ్యేదేనా..!

కాంగ్రెస్ పార్టీకి కేవలం 40 సీట్లు ఉన్నాయి. ఆ పార్టీకి 350 పైచిలుకు సీట్లున్న బీజేపీని ఓడించి అధికారం సంపాదించడం కుదరని పని. మెకానిక్ షాపు వద్ద కస్టమర్లు వస్తూనే ఉంటారు. వారు వారి స్కూటర్ రిపేర్ అయినంత వరకూ వేచి ఉంటారు. మీ కుటుంబాలు, కస్టమర్లు అందరూ బీజేపీకి ఓటు వేసేలా వారిని ప్రభావితం చేయాలి. ఉద్యోగాలు లేక కొందరు పట్టభద్రులు కూడా ఇలా మన కాళ్ల మీద మనం నిలబడి మెకానిక్ పని చేసుకుని బ్రతుకుతున్నాం. 200 కోట్ల పెట్టుబడి పెడితే మేజర్ ఇండస్ట్రీ అవుతుంది. ఈ కంపెనీలు రూ.400 కోట్ల రాయితీ అడుగుతుంది. వారికి కరెంటులో, భూమిలో, టాక్స్‌లలో రాయితీలు ఇస్తున్నారు. కానీ తమ కాళ్లపై నిలబడే మెకానిక్‌లకు ఎందుకు రాయితీలు ఇవ్వరు.

నేడు రాష్ట్రం మొత్తం మీద 10 వేల మంది ఉన్నారు. మీరందరూ అడిగేది న్యాయమైన కోరిక. మీకు కూడా ఒక అడ్డా కావాలి, షాపులు కట్టి, కిరాయి లేకుండా, కరెంటు సబ్సిడీ ఇస్తే చాలు. ప్రభుత్వం కాస్త సహాయం చేస్తే మీకుటుంబాలు బాగుపడతాయి. మీ పిల్లలను చదివించుకోగలుగుతారు. ఎవరెవరికో రాయితీలు, ప్రభుత్వ భూములు పంచిపెడుతున్నారు. మీలా కష్టపడి పని చేసుకునే వారికి ఎందుకివ్వరు. నేడు ప్రభుత్వాలు కొద్దిమంది బాగుతప్ప, శ్రామికుల బాధలు పట్టించుకోవడం లేదు. పేదలు ఎక్కడున్నా, బాధలు ఎక్కడున్నా నేను మీకు అన్నలా అండగా నిలబడి ఉంటానని మాట ఇస్తున్నాను

రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇస్తున్నాడు. కానీ ఆరు గ్యారెంటీలు నాలుగు నెలలవుతున్నా ఇప్పటికీ అమలు కావడం లేదు. ప్రతీ మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలిస్తామని, వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్లు పెంచుతామని ప్రజలను ఆశ పెట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా ఏదీ నెరవేర్చలేదు. ఆడపిల్ల వివాహానికి కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలతో పాటు, తులం బంగారం ఇస్తానని కూడా చెప్పాడు. అది ఒక్కరికి కూడా ఇంకా చేరలేదు.
రైతులకు 15 వేలు రైతుబంధు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ ఎవ్వరికీ రాలేదు.

ఈ ప్రాంతం అభివృద్ధి గురించి నేరుగా ప్రధాని మోదీని కలిసి మాట్లాడగల సత్తా ఉన్న వాడినని మీకు తెలుసు. నేను మీకు అబద్దపు హామీలు ఏవీ ఇవ్వడం లేదు. రోడ్లు, అభివృద్ధి, ఐటీ కారిడార్ సాధించి పెడతానని మాట ఇస్తున్నాను. మల్కాజ్‌గిరిలో నన్ను, ప్రధానిగా మోదీని కమలం పువ్వు గుర్తుపై ఓటువేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news