తెలంగాణలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లు, 01 అసెంబ్లీ స్థానానికి మే 13న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కేవలం ఎన్నికల ప్రచారానికి 10 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఢిల్లీ నుంచి పలువురు నేతలు తెలంగాణ గల్లీలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షా, జే.పీ.నడ్డా వంటి కీలక నేతలు రోడ్డు షో, ప్రచార సభల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.
తాజాగా మరోసారి ఢిల్లీ పెద్దలు అమిత్ షా, జే.పీ.నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 5 న అమిత్ షా, 6న J.P.నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మే 5 న ఉదయం 11:30 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్ లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. అలాగే మధ్యాహ్నం 1.30 గంటలకు నిజామాబాద్ పార్లమెంట్ నిజామాబాదులో బహిరంగ సభ, సాయంత్రం 4 గంటలకు మల్కాజ్ గిరి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు అమిత్ షా.
ఈనెల 6న బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా ఉదయం 11 గంటలకు పెద్దపల్లి లో, మధ్యాహ్నం 1గంటకు భువనగిరిలో, మధ్యాహ్నం 3.30 గంటలకు నల్గొండలో జరగనున్న బహిరంగ సభలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.