ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) పాలసీలను అందించే పాలసీ బజార్ సంస్థపై రూ.24 లక్షల మేర జరిమానా విధించింది. పాలసీ బజార్ సంస్థ అడ్వర్వయిజ్‌మెంట్ నిబంధనలతోపాటు పలు ఇతర నియమాలను ఉల్లంఘించిందని చెబుతూ ఐఆర్‌డీఏఐ ఆ మొత్తం ఫైన్ విధించింది. ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి నియమాలను ఉల్లంఘిస్తూ పాలసీ బజార్ వ్యవహరించిందని ఐఆర్‌డీఏఐ తెలియజేసింది.
గతేడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 7వ తేదీల మధ్య పాలసీ బజార్ సంస్థ దేశంలోని తన 10 లక్షల మంది కస్టమర్లకు ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంలు పెరగబోతున్నాయంటూ ఎస్ఎంఎస్‌లను పంపించింది. అందువల్ల ముందుగానే పాలసీలను తీసుకుంటే వినియోగదారులు రూ.1.65 లక్షల మేర ఆదా చేయవచ్చని తెలిపింది.
అలాగే అడ్వర్టయిజ్‌మెంట్లను ఇవ్వడంలోనూ పాలసీ బజార్ నిబంధనలను ఉల్లంఘించిందని, యాడ్స్‌లలో సరైన సమాచారం ఇవ్వకుండా మెసేజ్‌లను పంపించిందని ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఇవన్నీ వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంది. అందువల్లే పాలసీ బజార్‌పై రూ.24 లక్షల జరిమానా విధించినట్లు ప్రకటించింది. అయితే దీనిపై పాలసీ బజార్ స్పందిస్తూ.. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వంటి కంపెనీలు తాము అందించే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలకు గాను ప్రీమియంలను పెంచబోతున్నట్లు తమకు తెలిపాయని, అందుకనే ఆ మెసేజ్‌లను వినియోగదారులకు పంపించామని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఐఆర్‌డీఏఐ సంతృప్తి చెందలేదు. ఆ మొత్తం జరిమానాను కట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.