కరోనా వైరస్‌ గాలిలో వ్యాపిస్తుందా?

-

ఇటీవల విపరీతంగా వ్యాపిస్తున్న పుకార్లలో ఇదొకటి. గాలిలో కరోనా వైరస్‌ 8 గంటలు జీవిస్తుందని వాట్సప్‌లలో ఫేక్‌ మెసేజ్‌లు గిరగిరా తిరుగుతున్నాయి.

 

ప్రపంచం మీద పగబట్టిన కరోనా వైరస్‌ దేశదేశాల మీద తన దాడిని కొనసాగిస్తుండగా, దానికి పోటీగా పుకార్ల దాడి ఇంకా ఎక్కువయింది. అలాంటి వాటిల్లో నిన్న మొన్న బాగా పాపులర్‌ అయింది, కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందని, గాలిలో దాదాపు 8 గంటలు బతికుంటుందని (ఎయిర్‌బార్న్‌).

ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, కరోనా గాలిలో బతికుంటుందని, వ్యాపిస్తుందని ఎటువంటి ఆధారాలు లేవు. అయితే, కరోనా పేషెంట్లకు దగ్గరగా ఉండే వైద్య సిబ్బందికి WHO జాగ్రత్తలు చెప్పిందనేది మాత్రం వాస్తవం. పేషెంట్లు దగ్గినప్పుడు గానీ, తుమ్మినప్పుడు గానీ, ఆ తుంపరలు గాలిలోకి వేగంగా విసిరివేయబడతాయి కాబట్టి, అందరూ కనీసం రెండు మీటర్ల దూరం పాటించాలని, యాంటీ-వైరస్‌ సూట్‌, మాస్క్‌లు వేసుకోవాలని సూచించింది.

ఇంతవరకు ప్రపంచంలో ఏ మూలా కరోనా గాలి ద్వారా వ్యాపించిందనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. ముందుగా మొదలైన చైనాలో కూడా ఇది నిర్ధారణ కాలేదు. నిజానికి గాలి ద్వారా వ్యాపించడమనేది జరిగితే, ప్రపంచం ఈపాటికే అల్లకల్లోలం అయిపోయేది. వైరస్‌ పుట్టిన వుహాన్‌ నగరానికి 590 కి.మీ దూరంలో ఇంకో అతిపెద్ద నగరం షాంఘై ఉంది. అక్కడికి వుహన్‌ నుండి బుల్లెట్ రైళ్లు, విమానాలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. రైలులో దాదాపు ఐదున్నర గంటల ప్రయాణం. గాలిలో ప్రయాణిస్తే, గంట సేపు. మరి షాంఘై నగరంలో ఒక్క కేసు కూడా లేదు. ఎందుకు?

మనదేశంలో మహారాష్ట్ర, కేరళలో అధిక కేసులు నమోదయ్యాయి. అవన్నీ కొన్ని జిల్లాల్లో, అదీ ఎక్కువగా విదేశాలనుంచి వచ్చినవారివే. ప్రాథమిక కాంటాక్టులు ఇప్పుడిప్పుడు నమోదవుతున్నాయి. మరి గాలి ద్వారా వ్యాపించే పనైతే, నిమిషాల్లో జిల్లాలు, రాష్ట్రాలకు సోకివుండాలి కదా. కాబట్టి ఇదంతా పచ్చి అబద్ధం.

కరోనా వ్యాపించాలంటే రెండేరెండు మార్గాలు. 1) రోగిని లేదా రోగి వాడుతున్న వస్తువులను నేరుగా ముట్టుకున్నప్పుడు. 2) రోగి తుమ్మినప్పుడో, దగ్గినప్పుడో పక్కనే ఉండటం…. అంతే.

పై రెండు కారణాల వల్లనే ప్రపంచ ఆరోగ్గ సంస్థ, దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు సోషల్‌ డిస్టన్స్‌ పాటించమనేది, షేక్‌హ్యాండ్లు వద్దనేది-నమస్కారం ముద్దనేది. అన్నింటికంటే ముఖ్యంగా ఎలాగూ దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది కాబట్టి, అసలు ఇంట్లోనుండి బయటకు రాకపోవడం అన్ని రకాలుగా శ్రీరామరక్ష. దయచేసి పాటించండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version