తెలంగాణ వచ్చాక..రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు తిరుగులేదనే పరిస్తితి ఉన్న విషయం తెలిసిందే…అసలు ఏ మాత్రం టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చే పార్టీ లేకుండా పోయింది. ప్రతిపక్షాలు అన్నీ వీక్ అయిపోయాయి. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణలో కేసీఆర్‌ని ఢీ కొట్టే నాయకుడే కనిపించలేదు. కానీ ఓ ఏడాది నుంచి టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనేలా బీజేపీ ఎదిగింది…పైగా ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌ని మట్టికరిపించి సత్తా చాటింది. దీంతో టీఆర్ఎస్‌కు అసలైన పోటీ బీజేపీనే అనే పరిస్తితి వచ్చింది.
అయితే టీఆర్ఎస్‌పై రోజురోజుకూ ప్రజా వ్యతిరేకత పెరగడం, బీజేపీకి ఆదరణ పెరగడం జరుగుతూ వచ్చాయి. ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో రాజకీయం చేస్తూ..కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తూ వెళుతున్నారు. ఇలా టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ వచ్చింది…ఇలాంటి తరుణంలో కేసీఆర్ ఒక్కసారిగా రాజకీయం మార్చేశారు. అసలు బీజేపీ టార్గెట్‌గా ఆయన సెంటిమెంట్ రాజకీయాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
రాష్ట్రంలో ఉన్న బీజేపీని కాకుండా…కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి రాజకీయం చేయడం మొదలుపెట్టారు. అసలు మోదీ ప్రభుత్వం వల్ల దేశమే నాశనమైపోతుందనే కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చారు..అలాగే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని, మోదీకి రాష్ట్ర విభజన ఇష్టం లేదనే కోణాన్ని తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంట్‌ని మళ్ళీ ప్రజలని రెచ్చగొట్టి, బీజేపీని శత్రువుగా చూపిస్తూ రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి సెంటిమెంట్ రాజకీయాల్లో కేసీఆర్‌ని మించిన వారు లేరనే చెప్పాలి. అందుకే మళ్ళీ తెలంగాణలో సెంటిమెంట్ రగులుతున్నట్లు కనిపిస్తోంది.
ఇక కేసీఆర్ రాజకీయానికి చెక్ పెట్టాలని బండి కూడా గట్టిగానే ట్రై చేస్తున్నారు. కేసీఆర్ అవినీతిపై విచారణ జరగబోతోందని, తన పని ఖతమైందని గ్రహించి తెలంగాణ సెంటిమెంట్‌తో రాజకీయ లబ్ది పొందే కుట్రకు తెరతీశారని బండి, తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మోదీపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని, రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలని తెలంగాణ సమాజమంతా అసహ్యించుకుంటోందని, దీనిపై ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీపై ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే బండి చెప్పే మాటల్లో లాజిక్ ఉంది…కానీ తెలంగాణ ప్రజలు ఇవి నమ్ముతారా? లేక కేసీఆర్ సెంటిమెంట్‌కు లొంగిపోతారో అర్ధం కాకుండా ఉంది. మొత్తానికైతే ఇప్పుడు కేసీఆర్‌దే పైచేయిగా ఉంది.