దేశంలో రూ.2వేల నోట్లు అమలులోకి వచ్చినప్పటి నుంచి వాటిపై అనేక పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. రూ.2వేల నోటును ముద్రించడం ఆపేశారని కనుక ఆ నోట్లు ఇక లభ్యం కావని గతంలో పుకారు లేపారు. అయితే అది అబద్ధమని తేలింది. ఇక ఇటీవలే మళ్లీ ఇలాంటి పుకారునే పుట్టించారు. కానీ కరోనా వల్ల సదరు నోట్ల ముద్రణ ఆగిందని పరిస్థితి చక్కబడ్డాక నోట్లను మళ్లీ అవసరానికి అనుగుణంగా ముద్రిస్తామని అధికారులు తెలిపారు. ఇక తాజాగా రూ.2వేల నోట్లపై మరొక పుకారు విస్తృతంగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే..
రూ.2వేల నోట్లు ఇకపై ఏటీఎంల నుంచి రావని కేవలం రూ.100, రూ.200, రూ.500 నోట్లు మాత్రమే ఏటీఎంల నుంచి లభిస్తాయని ఒక వార్తను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఇదే విషయమై స్పష్టతనిచ్చింది. రూ.2వేల నోట్లు ఇక ఏటీఎంలలో రావనే వార్త అబద్ధమని ఆ వార్తలను నమ్మకూడదని తెలిపింది. రూ.2వేల నోట్లు అధిక సంఖ్యలో చెలామణీలో ఉన్నాయని తెలిపింది. కనుక రూ.2వేల నోట్లు ఇక ఏటీఎంల నుంచి రావు.. అనే వార్తలను నమ్మకూడదని హెచ్చరించింది.
కాగా ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అనురాగ్ ఠాకూర్ రూ.2వేల నోట్ల చెలామణీ విషయమై స్పష్టతను ఇచ్చారు. మార్చి 31, 2020 వరకు దేశంలో మొత్తం 27,398 లక్షల సంఖ్యలో రూ.2వేల నోట్లు చెలామణీలో ఉన్నాయన్నారు. గతేడాది మార్చి 31వ తేదీ వరకు 32,910 లక్షల నోట్లు చెలామణీలో ఉండేవన్నారు. కరోనా నేపథ్యంలో రూ.2వేల నోట్ల ముద్రణ ఆగిన సంగతి నిజమే కానీ దశలవారీగా మళ్లీ ఆ నోట్లను ముద్రిస్తున్నామని తెలిపారు.