అవును! ఈ చర్చ ఎన్నికలకు ముందు జరిగింది. మళ్లీ ఇప్పుడు కూడా జరుగుతుండడం ఆశ్చర్యంగా అనిపి స్తోంది. ఎన్నికలకు ముందు పవన్ అధికారంలోకి వచ్చే విషయంలో ప్రాంతానికి ఒక రకంగా ప్రసంగించి యువతలోను, మధ్య తరగతిలోనూ ఆశలను ఛిద్రం చేశారు. కొంతసేపు.. కానిస్టేబుల్ కుమారుడు సీఎం కాకూడదా ? నాకు లేని అర్హతలేంటి ? జగన్‌కు ఉన్న అర్హతలేంటి ? అని ప్రశ్నించారు. అదే సమయంలో తాను నిర్వహించిన మరో ఎన్నికల సభలో తాను 25 ఏళ్ల పోరాటానికి సిద్ధపడి పార్టీ పెట్టానని, తనకు అధికారంతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు.
అంతేకాదు, కేవలం గెలుపుకోసమే అయితే, ఎవరూ తన పార్టీలోకి చేరవద్దని కూడా పిలుపునివ్వడం పవన్ ను ఓ క్లారిటీ లేకుండా చేసిందనే విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వం చేస్తున్న పనులపై విమర్శలు చేయడం ఏ ప్రతిపక్షానికైనా రివాజు. అయితే, పవన్ మాత్రం దీనికి భిన్నంగా అధికార పక్షాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షంపై విమర్శలు చేయడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ విషయంలోనూ ఆయనకు క్లారిటీ లేకుండా పోయిందని అభిమానులు కూడా తలలు పట్టుకున్న పరిస్థితి కనిపించింది. ఇక, ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోయాయి. పవనే రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేక పోయారు.
అలాంటి పార్టీని ఇప్పుడు పట్టాలకు ఎక్కించే క్రతువును పవన్ భుజాలపైకిఎత్తుకున్నారని సమాచారం. దీనికి ప్రధాన కారణం.. ఇప్పటికే ఉన్న జనసేన నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీలు మారేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే జనసేన టికెట్‌పై ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, ఆకుల సత్యనారాయణ కూడా తిరిగి బ్యాక్ టు పెవిలియన్ అంటూ బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇక, విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిన జేడీ లక్ష్మీనారాయణ కూడా ముహూర్తం చూసుకుంటున్నారు. ఆయన చూపు బీజేపీ వైపు ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ చాలా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అయితే, ఇటీవల ఆయన జగన్ ప్రభుత్వంపై విడుదల చేసిన 33 పేజీల నివేదికను పరిశీలిస్తే.. ఏదో క్లారిటీ మిస్సయినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అదే టైంలో ఏపీలో పార్టీని, నేతలను ఇలా వదిలేసి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళుతున్నారు. అసలు పవన్ టార్గెట్ ఏపీ రాజకీయాలా ? తెలంగాణ రాజకీయాలా ? లేదా రెండు తెలుగు రాష్ట్రాలా ? అన్నది కూడా రాజకీయ మేథావులకే అంతు పట్టడం లేదు . మరి పవన్ ఎప్పుడు సరిచేసుకుంటాడో చూడాలి.