ఇప్పుడు వాహనదారులు ఎక్కడి వెళ్ళాలన్నా జేబునిండా కాసులు నింపుకుని ప్రయాణించాల్సిందే.. ఇంతకాలం తమ వాహనంలో తమ ఇష్టారాజ్యం వెళ్ళిన వాహనదారులకు ఇప్పుడు కొత్త వాహన చట్టంతో జేబులకు చిల్లులు పడే పరిస్థితి రావడంతో వాహనాలను రోడ్డుమీదికి తీయాలంటే భయపడుతున్నారు. బండి తీస్తే ఎక్కడ జేబుకు చిల్లు పడుతుందో అనే భయంతో వాహనాలను తీసేందుకు జంకుతున్న తరుణంలో తెలంగాణ సర్కారు వాహనదారులకు తీపీ కబురు చెప్పింది. పశ్చిమ బెంగాల్, గుజరాత్ బాటలోనే తెలంగాణ నడవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ ప్రాంత వాహనదారులు ఖుషిగా అయ్యే వార్తను చెప్పాడు తెలంగాణ సీఎం కేసీఆర్.
ట్రాఫిక్ నిబంధనలను సరిగా పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని భావిస్తోన్న కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంట్ సమావేశాల్లో కొత్త మోటారు వాహనాల చట్టాన్ని అమలులోకి తెచ్చింది. భారీ జరిమానాలను విధించేలా రూపొందించిన ఈ కొత్త వాహన చట్టంపై విమర్శలు వస్తున్నాయి. కేంద్రం తెచ్చిన ఈ కొత్త వాహన చట్టం సామాన్యుల నడ్డి విరిచింది. కొత్త వాహన చట్టం ప్రకారం ఫైన్లను భారీగా వసూలు చేస్తున్న తరుణంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు కొత్త వాహన చట్టం అమలు చేయడం కుదరదు.. పాత చట్టం ప్రకారమే ఫైన్లు వేస్తారని కేసీఆర్ తీపి కబురు చెప్పారు. అదే టైంలో కేంద్రం తెలంగాణ విషయంలో శీతకన్ను వేయడంతో పాటు టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తుండడంతో కేసీఆర్ నిర్ణయం కేంద్రాన్ని లైట్ తీస్కొన్నట్లుగా కనపడుతోంది.
ఈ చట్టాన్ని అమలు చేయబోమంటూ ఇప్పటికే గుజరాత్, పశ్చిమబెంగాల్ ప్రకటించాయి. ఇప్పడు కేసీఆర్ కూడా తెలంగాణలో ఈ చట్టాన్ని అమలు చేయడం లేదంటూ ప్రకటించాడు. అసెంబ్లీ కేంద్ర ట్రాఫిక్ చట్టం పరిస్థితి ఏమిటని మజ్లిస్ ఎమ్మెల్యే మోజంఖాన్ అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. ‘‘రాష్ట్రానికి సంబంధించి చట్టాన్ని మనమే తయారు చేసుకుందామ’’ని ఆయన చెప్పారు. చలానాల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలోని వాహనదారులకు ఊరట లభించింది. కేంద్రం చేసిన చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉండటంతో ఈ చట్టాన్ని అమలు చేయడానికి గుజరాత్, పశ్చిమ బెంగాల్ నిరాకరించగా, ఇప్పుడు తెలంగాణ వారి బాటలో నడుస్తుంది..