హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరు లో జరిగిన కోడి పందాల్లో టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హస్తం ఉందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ కోడి పందాలు నిర్వహిస్తున్న 21 మంది పందాల రాయుళ్లను అరెస్టు చేశారు పోలీసులు. 31 కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తనపై వస్తున్న వార్తల పై సోషల్ మీడియా వేదికగా చింతమనేని స్పందించారు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని అన్నారు.
కోడిపందాల్లో లేని వ్యక్తిని అక్కడ ఉన్నట్లు చూపించడం కొందరి రాజకీయ జెండా, అజెండా అని విమర్శించారు. నీచమైన ప్రచారాలు చేస్తూ కూలిపోయే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారని ఆయన దుయ్యబట్టారు. ఆ మేడ కూలిపోయే సమయం ఆసన్నమైందని అన్నారు. ఇంత రాక్షస రాజకీయం అవసరమా? అని ప్రశ్నించారు. కోడిపందాల్లో లేని వ్యక్తిని ఉన్నట్లు చూపిస్తున్నారని వాపోయారు. మీ రాక్షస రాజకీయాలకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు.