హుజురాబాద్ ఉప ఎన్నిక 2023 అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో నిలబడి ఎమ్మెల్యేగా గెలిచేందుకుగాను పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారి టీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా రాజేందర్‌ను ఓడించాలని ప్లాన్ చేసినట్లు ఇప్పటికే ప్రకటించిన ‘దళిత బంధు’ తేటతెల్లమైంది. దీంతో పాటు ఈటల ఇమేజ్ చేసేందుకుగాను గులాబీ పార్టీ మొదటి నుంచి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే రకరకాల ప్రచారాలను పింక్ పార్టీ తెరమీదకు తెస్తున్నదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత రోజునే ఆయన పేరిట విష ప్రచారానికి తెరలేపారు కొందరు. తాను తప్పు చేశానని, క్షమించాలని కేసీఆర్‌ను ఈటల రాజేందర్ కోరినట్లు ఓ లేఖ సృష్టించారు. కాగా, అది వైరల్ అవుతున్న క్రమంలోనే ఈటల స్పందించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఆ తర్వాత క్రమంలో రాజేందర్ బీజేపీ తరఫున బరిలో నిలిచిన ‘ప్రజా దీవెన యాత్ర’ పేరిట పాదయాత్ర స్టార్ట్ చేసి ప్రజల్లోకి వెళ్లారు. ఇటీవల అస్వస్థతకు గురి కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనూ ఆయన్ను ‘దళిత ద్రోహి’ అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈటల రాజేందర్ బావమరిది దళితులను కించపరిచినట్లు సోషల్ మీడియలో ప్రచారం చేస్తున్నారు. ఇలా విష ప్రచారం చేసి గులాబీ పార్టీకి మైలేజ్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన ఆధారాలను బహిరంగపరచాలని, పోలీసులకు సమర్పించి ఫిర్యాదు చేయాలని బీజేపీ నేతలు విసిరిన సవాళ్లకు మాత్రం స్పందించడం లేదు. ఈటల బావమరిది పేరిట వస్తున్న స్క్రీన్ షాట్లపై విచారణకు పూనుకోవడం లేదు. మొత్తంగా ఈటల రాజేందర్ కేంద్రంగా ఆయన, ఆయన కుటుంబీకులపై సాగుతున్న విషప్రచారం ఎంత వరకు ఉంటుందో? తెలియడం లేదు. అయితే, ఇలా విషప్రచారం చేయడం వల్ల ఈటలకు ఎలాంటి నష్టం ఉండబోదని, ఇమేజీ ఇంకా పెరిగి మెజారిటీ ఓట్లతో ఈటల గెలుపొందుతారని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.