కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకునే బాక్టీరియా.. అభివృద్ధి చేసిన సైంటిస్టులు..

భూమిపై ఉండే ఏ జీవి అయినా సరే సహజంగానే ఆక్సిజన్‌ను పీల్చుకుని కార్బన్ డయాక్సైడ్‌ను విడిచిపెడతాయి. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే మానవుడు చేస్తున్న పలు తప్పిదాల వల్ల పర్యావరణంలోకి ప్రస్తుతం పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతోంది. దీంతో పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలుగుతోంది. అయితే ఈ నష్టాన్ని పూడ్చాలంటే.. మొక్కలను ఎక్కువగా నాటాలని పర్యావరణ వేత్తలు చెబుతుంటారు. కానీ.. భవిష్యత్తులో మరింత సులభంగా కార్బన్ డయాక్సైడ్‌ను పర్యావరణం నుంచి తొలగించే ప్రక్రియకు సైంటిస్టులు శ్రీకారం చుట్టనున్నారు. ఎలాగంటే..?

Israel scientists developed a bacteria that takes carbon dioxide

ఇజ్రాయెల్‌లోని వెయిజ్‌మన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (డబ్ల్యూఐఎస్)కు చెందిన పరిశోధకులు కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని పిండి పదార్థాలను విసర్జించే నూతన బాక్టీరియాను అభివృద్ధి చేశారు. సాంప్రదాయ ఇ.కోలి బాక్టీరియాకు చెందిన జీన్స్‌కు మార్పులు, చేర్పులు చేసి వాటిని కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకునే విధంగా రూపాంతరం చెందించారు. అయితే సాధారణ ఇ.కోలి బాక్టీరియా కార్బొహైడ్రేట్లను తిని కార్బన్ డయాక్సైడ్‌ను విడిచిపెడతాయి. కానీ అందుకు భిన్నంగా ఆ బాక్టీరియాను అభివృద్ధి చేయడం విశేషం.

అయితే సదరు సైంటిస్టులు తమ పరిశోధనలను మరింత విస్తృతం చేసి త్వరలోనే వాటిని పర్యారణం కోసం ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దనున్నారు. దీంతో ఆ బాక్టీరియా పర్యావరణంలో పెద్ద మొత్తంలో ఉండే కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుంటుంది. ఈ క్రమంలో పర్యావరణంలో ఉండే కాలుష్య కారకాల ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. కాగా సదరు పరిశోధనలకు చెందిన వివరాలను సెల్ అనే ఓ జర్నల్‌లోనూ ప్రచురించారు.