దీపాలతో ప్రతీ కార్యక్రమాన్ని ప్రారంభించడం మన సాంప్రదాయం అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఇవాళ ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ, ఎన్టీవీ వారు నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఆమె విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథుడికి, లక్ష్మీ నరసింహాస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె దీప ప్రజల్వలన చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు తెలంగాణ గవర్నర్ బిష్ణు దేవ్ శర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రమంత్రి సీతక్క పూజలో పాల్గొని దీపాలు వెలిగించారు.
ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పూరి జగన్నాథుడి కళ్యాణంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు నేలపై కార్తీక మాసం వేళ కోటి దీపోత్సవం వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్తీక మాసంలో అందరూ శివుడిని కొలుస్తారు. అసత్యం పై సత్యం గెలిచిన పండుగ ఇది అన్నారు. అందరూ ఒక్కటై దీపాన్ని వెలిగించడం ఏకత్వాన్ని సూచిస్తుందన్నారు. అనంతరం కోటీ దీపోత్సవంలో జాతీయ గీతం ఆలపించారు.