-
ఏపీపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ
-
రాష్ట్రానికి ఇదొక శరాఘాతంః వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
అమరావతిః ఇది ముమ్మాటికీ ఎన్నికల బడ్జెట్టే అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. సోమవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ఉద్దేశించి విజయసాయి రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ 2021-22 బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉందని పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు ఇదొక శరాఘాతం అని అన్నాడు. ఏపీపై బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని పేర్కొన్నాడు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ.. కేటాయింపులు జరిపారని తెలిపాడు.
మెట్రో రైల్ విషయంలో కూడా ఏపీకి అన్యాయం చేశారని తెలిపాడు. ఇందులో కొచ్చి, చెన్నై, బెంగళూరు ఇలా పలు చోట్లా మెట్రో ఏర్పాటు ప్రాధాన్యం ఇచ్చారు కానీ.. ఏపీకి మాత్రం ఇవ్వలేదని ఆవేదనను వెళ్లగక్కారు. రాష్ట్రంపై ఆత్మ నిర్భరత కనిపించడం లేదన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల కేటాయింపులో కూడా ఎలాంటి స్పష్టత లేదని తెలిపాడు.
ఖరగపూర్ – విజయవాడ ఫ్రైట్ కారిడార్ ఒక్కటే కనిపించిందని తెలిపాడు. దీంతో రాష్ట్రానికి ఏమీ ఒరిగేది లేదని పేర్కొన్నాడు. 11 శాతం కూరగాయలు, పండ్లు ఏపీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నాడు. అయినా కానీ కిసాన్ రైళ్లల్లో ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపాడు. ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని రాష్ట్రానికి ఇవ్వాలని కోరామని తెలిపాడు. కానీ దానికి కనీస విలువివ్వకపోవడం బాధగా ఉందని తెలిపాడు.
రాష్ట్రంలో ధాన్యం సేకరణకు సంబంధించి రూ. 4వేల కోట్లకు పైగా బకాయిలున్నాయని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపాడు. రాష్ట్రంలో కొత్తగా 25 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయని తెలిపాడు. ప్రతీ జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయానైనా ఏర్పాటు చేయాలని కోరాడు.
ఆరోగ్యశ్రీ కి పోటీగా ఆయుష్మాన్ భారత్‌ను అన్ని వ్యాధులకు కవర్ చేసేలా రూపొందించాలని కోరుతున్నామని తెలిపాడు. దేశంలో నిరుద్యోగం ఎంతగానో పెరుగుతుందని తెలిపాడు. దీనిపై కేంద్ర ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. పనికి ఆహార పథకం విషయంలో 150 రోజులకు పని దినాలు పెంచాలని ఎప్పటినుంచో కోరుతున్నామని తెలిపాడు. కానీ దీనిపై బడ్జెట్ లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం ఎంతో బాధ కలిగించిందని తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆశించినట్టుగా ఈ బడ్జెట్ లేదని తెలిపాడు. ఇది కేంద్ర బడ్జెట్‌లా కనిపించడం లేదని విమర్శించాడు. ఈ బడ్జెట్ కేవలం తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల కోసం రూపొందించినట్లుగా ఉందని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నాడు.