నెల్లూరు బ్రదర్స్ మధ్య మళ్లీ గ్యాప్ పెరిగిందా

-

సింహపురి రాజకీయ తెరపై అనేకమంది నెల్లూరు బ్రదర్స్‌గా ఓ వెలుగు వెలిగారు. ఆ మధ్య కొత్త సోదరులు తెరపైకి వచ్చారు. ఒకే మాట ఒకే బాట అన్నట్లు ప్రయాణించారు. ఇప్పుడు ఎవరికి వారుగా సాగిపోతున్నారు. ఒకేచోట ఉన్నా కలిసేందుకు కూడా కష్టంగా ఫీలవుతున్నారట. వారే మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నియోజకవర్గాలు వేరైనా తామిద్దరం ఒకటే అన్నట్లుగా మెలిగేవారు. ఒకరి పొడ మరొకరికి గిట్టనంతగా విభేదాలు పెరిగిపోయాయట…

మంత్రి అనిల్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డిలకు ఎలాంటి రాజకీయ వారసత్వం లేదు. సాధారణ రైతు కుటుంబాల నుంచి వచ్చి.. నెల్లూరు జిల్లాలో కాకలు తీరిన నేతలను వెనక్కి నెట్టారు. రాజకీయంగా ఉద్దండులనుకునే వారిపై గెలిచారు. నెల్లూరు సిటీ నుంచి ఒకరు.. నెల్లూరు రూరల్‌ నుంచి మరొకరు వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆశ్చర్యపరిచారు. బ్యాక్‌గ్రౌండ్‌ ఏదైనా ఒకే అన్నదమ్ముల్లా మెలిగారు అనిల్‌, కోటంరెడ్డి. గతంలో తమపై వచ్చిన ఆరోపణలను సైతం కలిసికట్టుగానే తిప్పికొట్టారు. మంత్రిగా అనిల్‌ తొలిసారి జిల్లాకు వచ్చినప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికారు కోటంరెడ్డి.

ఇంతటి రాజకీయ అనుబంధాన్ని పెంచుకున్న ఈ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్‌ వచ్చింది. ఒకరంటే ఒకరికి పడటం లేదట. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేస్తున్న సిఫారసులను మంత్రి అనిల్‌ పట్టించుకోవడం లేదన్నది అధికార పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. తన మాట నెగ్గకపోవడంతో అమరావతి వెళ్లి పార్టీ పెద్దల ద్వారా లాబీయింగ్‌ చేసుకోవాల్సిన పరిస్థితికి కోటంరెడ్డి వచ్చారట. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇటీవల జరిగిన బదిలీలు.. మున్సిపాలిటీలో పాలనా వ్యవహారాలు.. లే అవుట్ల అనుమతులు.. ప్రభుత్వ పథకాలలో లబ్ధిదారుల ఎంపిక ఇలా వివిధ అంశాల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట నెగ్గడం లేదన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఎస్‌ఐ, సీఐల బదిలీలు, అప్పట్లో కోవిడ్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ బదిలీపై ఇద్దరు నేతల మధ్య పెద్ద ఎత్తున రచ్చ జరిగిందని టాక్‌. సూపరింటెండెంట్‌గా ఆరు నెలల కాలంలోనే ముగ్గురు మారారు. గతంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట వినని శ్రీహరిరావును రెండోసారి నియమించారు. దాంతో శ్రీహరిరావును ట్రాన్స్‌ఫర్‌ చేయించేందుకు ఎమ్మెల్యే చాలా శ్రమించాల్సి వచ్చిందట. చివరకు శ్రీహరిరావును సాగనంపి ఆయన స్థానంలో సుధాకర్‌రెడ్డి అనే అధికారిని తెచ్చుకున్నారట కోటంరెడ్డి. నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఈ 14 నెలల కాలంలో ముగ్గురు కమిషనర్లుగా రావడం వెనక కూడా నేతల మధ్య ఆధిపత్య పోరే కారణమని చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పుడు ఓ ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది. ఐఏఎస్ అధికారి అయితే మంత్రులు చెప్పిందే చేస్తారు. ఎమ్మెల్యేలు చెప్పింది పట్టించుకోకపోవచ్చనే ప్రచారం ఉంది. ఈ ఎత్తుగడ కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డికి చెక్‌ పెట్టేందుకేనని అనుకుంటున్నారు.

అభివృద్ధి పనుల విషయంలోనూ ఎమ్మెల్యే ఒకటి చెబితే.. మంత్రి మరొకటి అంటున్నారట. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలోనూ ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నట్లు సమాచారం. ఇటీవల ఓ లేఅవుట్‌ విషయంలో పంతాలకు పోయినట్లు చెప్పుకొంటున్నారు. కొన్ని టెండర్లు దక్కించుకునేందుకు మంత్రి, ఎమ్మెల్యే అనుచరులు పోటీ పడటంతో విభేదాలు ఇంకా తారాస్థాయికి చేరుకున్నాయట.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఈ నానుడిని నిజం చేస్తారో.. లేక మళ్లీ కలిసిపోతారో తెలియదు కానీ.. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల ముందు ఇద్దరు నేతల మధ్య వచ్చిన గ్యాప్‌ అధికార పార్టీని కలవరపరుస్తున్నాయట.

Read more RELATED
Recommended to you

Latest news