ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. పాపం.. వీరు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేసినా వీరి వేతనాలు చాలా తక్కువ. అంతే కాదు.. ఉద్యోగాలకు గ్యారంటీ ఉండదు.. ఒక్కో ఉద్యోగానికి ఒక్కో వేతనం.. నియామకాల్లోనూ అవకతవకలు.. అందుకే ఇక ఇప్పుడు ఈ ఇబ్బందులు లేకుండా జగన్ వారికి గుడ్ న్యూస్ చెప్పేశారు.
జగన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సరాసరి ఈ కార్పొరేషన్ ద్వారా అవుట్ సోర్సింగ్‌లో పని చేసే వేతన కార్మికులకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకుంటోంది ఏపీ సర్కారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు లక్షమందికిపైగా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.
ఇప్పటివరకూ వీరు ఆయా ఏజెన్సీల ద్వారా రిక్రూట్ అవుతున్నారు. నియమాకాల్లో అందరికీ అవకాశాలు దక్కకపోవడం, పనికి తగినట్టుగా ఉద్యోగులకు చెందాల్సిన జీతం పూర్తిస్థాయిలో లభించకపోవడం, సకాలంలో జీతాలు రాకపోవడం లాంటి సమస్యలను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలు నడుపుతున్నవారు తమకు నచ్చిన రీతిలో ఈ నియామకాలను చేపడుతున్నారు.
సాధారణ పరిపాలనాశాఖ ఆధ్వర్యంలో ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది. కార్పొరేషన్‌కు అనుబంధంగా జిల్లాల స్థాయిలో విభాగాలు ఏర్పాటవుతాయి. జిల్లా ఇన్‌ఛార్జిమంత్రులు ఈ విభాగాలకు నేతృత్వం వహిస్తారు, జిల్లా కలెక్టర్లు కార్పొరేషన్‌కు ఎక్స్‌అఫీషియోలుగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రభుత్వ విభాగాలు తమకు కావాల్సిన సర్వీసులను కొత్తగా ఏర్పాటవుతున్న ఈ కార్పొరేషన్‌కు, దీనికింద జిల్లాల్లో ఉన్న విభాగాలకు నివేదిస్తాయి.