సామాజికవర్గాల సమతూకంలో భాగంగా వైఎస్ జగన్ తొలి క్యాబినెట్ లో రోజాకు చోటు దక్కలేని సంగతి తెలిసిందే. అనంతరం అలకలు పూర్తి అయ్యాక ఎపిఐఐసి చైర్మన్ ను చేసి క్యాబినెట్ ర్యాంక్ స్థాయి పదవిని రోజాకు కట్టబెట్టారు జగన్! దీంతో ఒక పక్క నగరి ఎమ్యెల్యే బాధ్యతలు మరోపక్క ఏపిఐఐసి బాధ్యతలు చేపట్టిన ఆర్కే రోజాకు మరో బాధ్యత కూడా ఇవ్వనున్నారట జగన్. ఈ మేరకు జగన్ ఆలోచన చేస్తున్నారట. ఇది కూడా తోడయితే ఇక వైసీపీలో రోజా త్రిపాత్రాభినయం చేయాల్సి వస్తుంది!
వివరాళ్లోకి వెళ్తే… ఈనెల 9వ తేదీని చిరు ఆధ్వర్యంలో తెలుగు సినీ పెద్దలు కొందరు జగన్ ను కలవబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ కూడా ఏపీలో సినీ పరిశ్రమను బాగా ప్రోత్సహించాలని భావిస్తున్నారు. ఆ మధ్య తనను కలిసిన చిరంజీవి, ఇతర ప్రముఖులతో కూడా జగన్ ఇదే విషయాన్నీ చర్చించారు కూడా. ఇదే క్రమంలో కరోనా కారణంగా తీవ్ర కష్టాలు, నష్టాల్లో ఉన్న పరిశ్రమను ఆదుకోవడానికి సైతం జగన్ అందరికన్నా ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా ఏపీలో షూటింగ్స్ కి ఉచితంగా అనుమతి ఇచ్చేందుకు సర్కార్ సన్నద్ధం అయ్యింది.
ఈ క్రమంలో మరింత దూకుడుగా ఆలోచిస్తున్న జగన్.. సినీపరిశ్రమ అవసరాలకు సంబందించి ఒక కమిటీని వేయాలని ఆలోచిస్తున్నారట. ఏపీలో ఈ షూటింగ్స్ కి అనుమతులు ఎలా ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? వంటి అంశాలతోపాటు విశాఖలో చిత్రపరిశ్రమను అభివృద్ధి చేయాలనే ఆలోచన అమలుకు సంబందించిన అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. దీంతో చిత్ర పరిశ్రమపై వేయబోయే కమిటీ బాధ్యతలు ఆర్కే రోజాకు అప్పగించి, అందులో ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ లెక్కన అన్నీ అనుకూలంగా జరిగితే… రోజాకు త్రిపాత్రాభినయమే!