జిల్లాల పునర్విభజన లేదా పునర్విచనం అన్నది పెద్ద వివాదంలానే ఉంది. ఎందుకంటే వీటి వల్ల లాభాలు లేవు సరి కదా కొత్తగా కొన్ని నష్టాలు వచ్చి చేరేందుకే అవకాశాలు మెండు. లేదా పుష్కలం అని రాయాలి. శ్రీకాకుళం జిల్లాకు పారిశ్రామికంగా ఎచ్చెర్ల, రాజాం అనే రెండు నియోజకవర్గాలు ఆయువు వంటివి. జిల్లాతో సుదీర్ఘ అనుబంధం ఉన్నరాజాం ప్రాంతం నుంచి ప్రముఖ వ్యాపార వేత్త జీఎంఆర్ వచ్చారు. ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన నేతృత్వంలో గ్రంధి సోదరులు రాజాం పరిసరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేశారు.
జీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ ను నెలకొల్పారు. ఉన్నత విద్యకు ఎంతో సాయం అందించిన కాలేజీగా, నాణ్యతకు మారుపేరుగా నిలిచింది ఈ విద్యా సంస్థ. అదే విధంగా జిల్లాకు మరో ఆయువు ఎచ్చెర్ల. కొన్ని పోరాటాలు కారణంగా ఎందుకు వచ్చిన గొడవ అనుకుని శ్రీకాకుళం జిల్లాలోనే ఎచ్చెర్ల నియోజకవర్గంను ఉంచేశారు. ఇక ఎప్పటి నుంచో సాలూరు పరిసర ప్రాంతాలను జిల్లాగా చేయాలని ప్రతిపాదన ఉన్నా అది నెరవేరలేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు నేతల ఆలోచనలకు అనుగుణంగానే ముక్కలయ్యాయి.
విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. విజయనగరం, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, శృంగవరపు కోట, బొబ్బిలితో పాటు రాజాం(ఇప్పటి శ్రీకాకుళం జిల్లాలో కీలక నియోజకవర్గం) కలిసి విజయనగరం జిల్లాగా ఏర్పాటవగా, కురుపాం, పార్వతీపురం, సాలూరు మన్యం జిల్లాలోకి వెళ్లిపోయాయి. శ్రీకాకుళం జిల్లా ముచ్చటగా 3 ముక్కలు అయింది. 8 నియోజకవర్గాలతో శ్రీకాకుళం జిల్లా ఏర్పాటవగా, రాజాం నియోజకవర్గం విజయనగరం జిల్లాలోకి వెళ్లిపోయింది. మిగిలిన పాలకొండ మన్యం జిల్లాలో కలిసిపోయింది.
దీంతో జిల్లాకు సీతంపేట ఐటీడీఏ (శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం) పోయింది. విభజనలో భాగంగా రెండు పారిశ్రామిక వాడలను, ఒక ఐటీడీఏను జిల్లా కోల్పోయింది. అదేవిధంగా విజయనగరం జిల్లా ఐటీడీఏ పార్వతీపురం కేంద్రంగా ఉంది. దీనిని కూడా ఆ జిల్లాకోల్పోయింది. విశాఖ జిల్లాదీ అదే పరిస్థితి. పాడేరు ఐటీడీఏ కాస్త అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిసి పోయింది. అరకు లోక్ సభ నియోజకవర్గాన్ని రెండు ముక్కలుగా చేసి ఒక ముక్కకు మన్యంజిల్లాఅని పేరు పెట్టారు. మరోజిల్లాకు అల్లూరి సీతారామ రాజుఅని పేరు పెట్టారు.
మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం. ఓ విధంగా ఇది పార్వతీపురం వాసుల కోరిక. నెరవేరిందనే భావించాలి. పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం అనే నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలతో మన్యం జిల్లా ఏర్పాటైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, అరకు, రంపచోడవరం అనే 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండనున్నాయి. జిల్లా కేంద్రం పాడేరుగా నిర్ణయించారు.
ఈ జిల్లాలో రెండు ఐటీడీఏలు ఉన్నాయి. ఒకటి పాడేరు ఐటీడీఏ, రెండు రంపచోడవరం ఐటీడీఏ. మరి! నిధులు పుష్కలంగా వచ్చే అవకాశం ఈ జిల్లాకే ఉంది. అభివృద్ధికి ఆస్కారం కూడా అంతే స్థాయిలో ఉంది. గిరిజనుల జీవితాలు ఇకపై ఏ విధంగా ఉండనున్నాయో అన్నదే ఆసక్తిదాయకం. 1974 ఫార్మేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ యాక్ట్ ప్రకారం జిల్లాల పునర్విభజనను తెరపైకి తెచ్చి జగన్ మరో తేనెతుట్టనే కదిపారు.