వైసీపీ తరఫున మాట్లాడే గొంతుకలు వెనక్కు తగ్గుతున్న నేపథ్యంలో కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణా రెడ్డి గొంతుకలో సమర్థనీయ ధోరణి తగ్గతున్నందున కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు.ముఖ్యంగా తన తరఫున, పార్టీ తరఫున మాట్లాడే వారిలో అంబటి లాంటి వారు ఉన్నా, అనేక ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యాన అలాంటి వారి మాటలకు అంతటి స్థాయిలో నమ్మకం కుదరదు అని ఓ వాదన రాజశేఖర్ రెడ్డి అభిమానులే సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.
వీళ్లే ఎందుకంటే గతంలో రాజన్న బిడ్డగా మీ ముందుకు వస్తాననంటూ జగన్ ప్రకటించిన నేపథ్యంలో వీరంతా ఆ రోజు వైసీపీలో చేరకున్నా బయట నుంచి బాగానే మద్దతు ఇచ్చారు. ఇందులో కొందరు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఉన్నారు. కేవలం సొంత సామాజికవర్గం నుంచే కాకుండా అన్ని సామాజిక వర్గాల్లోనూ కులాల్లోనూ ఉన్న వైసీపీ అభిమానులే ఆ రోజు జగన్ కు అధికార ప్రతినిధులు అయ్యారు.
ముఖ్యంగా పాదయాత్ర సమయంలో ఆయనకు భలే మద్దతు ఇచ్చారు. వీళ్లంతా అనధికార అధికార ప్రతినిధులు. వీళ్లలో కొందరు సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో పనిచేసినా సోషల్ మీడియా యాక్టివిజం మాత్రం అస్పలు మానుకోలేదు. వీళ్లే ఇప్పుడు జగన్ తప్పిదాల గురించి వ్యాసాలు రాస్తున్నారు కూడా ! నిజాలు ఎవరో ఒకరు చెప్పాలి.. ఆ పని మేం చేస్తాం అని ముందుకు వస్తున్నారు. ఓవిధంగా ఇవన్నీ జగన్ కు కలిసివచ్చే పరిణామాలే ! వీటిలో ఉద్దేశ పూర్వక ఆరోపణలు లేవు కానీ పార్టీ క్షేమం కోరే నైజం మాత్రం ప్రస్ఫుట రీతిలో ఉంది.
ఇక తాజాగా ఢిల్లీ కేంద్రంగా మాట్లాడే గొంతుకలు కొన్ని కావాలని అనుకుంటున్నారు జగన్. కేవలం పదవులకే పరిమితం అయ్యే విధంగా కాకుండా రాష్ట్ర సమస్యలపై మాట్లాడి, కేంద్ర మంత్రులను కలుసుకుని ఈ ప్రాంత ప్రజల మనోగతం, స్థిర అభిప్రాయం, అభివృద్ధి విధానం వీటిపై మాట్లాడేవారు కావాలని కోరుకుంటున్నారు జగన్. ఢిల్లీ కేంద్రంగా టీడీపీకి ఢోకా లేదు. కానీ వైసీపీకి మాత్రం ఎంపీ రామూ స్థాయిలో మాట్లాడే వారు తక్కువగానే ఉంటున్నారు. ఈ సమయంలో ఇదే ప్రాంతానికి చెందిన మహిళా నేత, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్న యోచనలో భాగంగానే సీఎం వర్గాలు కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. కానీ అవేవీ తరువాత వర్కౌట్ కాలేదు. ఓ విధంగా సీఎం మాట తప్పారు అన్న భావన సిక్కోలు నాయకుల్లో ఉంది. మరి ! తాజా నియామకాల్లో భాగంగా వచ్చిన ఆర్.కృష్ణయ్య కానీ నిరంజన్ రెడ్డి కానీ మన తరఫున మాట్లాడతారా ? ప్రాంతేతర నేతలకు ఆ అవసరం ఉంటుందా ? ఇవే సందేహాలు పసుపు దండు నుంచే కాదు జగన్ పార్టీ నుంచి కూడా వస్తున్నాయి.