ఉన్నది ఒక్క ఎమ్మెల్యే.. పైగా అధినేత రెండు చోట్ల పోటీ చేసినా గెలవని సమయంలో గెలిచిన ఎమ్మెల్యే.. ఫ్యాన్ గాలి అత్యంత బలంగా వీస్తున్న సమయంలో నిలిచి గెలిచిన ఎమ్మెల్యే… జనసేన తరుపున అసెంబ్లీకి వెళ్లిన ఏకైక ఎమ్మెల్యే! ఆయనను సస్పెండ్ చేసే సాహసం పవన్ చేస్తారా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్న పెద్ద చర్చ! దానికి కారణం జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఓటు వేయడం! అలా అని పవన్ “విప్” జారీ చేసినట్లు ఎక్కడా వార్తలు కూడా రాలేదు అనుకోండి అది వేరే విషయం!
వైకాపా అభ్యర్ధికి ఓటు వేయడం అనే పని రాపాక వరప్రసాదే కావాలని చేశారా లేక వైకాపా రిక్వస్ట్ చేస్తే చేశారా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్నేమీ కాదు! ఎందుకంటే… 151 సీట్లతో వైకాపా అత్యంత బలమైన శక్తిగా ఉంది. ఈ సమయంలో రాపాక తన ఓటు వేసినా, వేయకపోయినా వైకాపాకు ఒరిగేదేమీ ఉండదు, పోయేదేమీ ఉండదు. అయినా కాని రాపాక ఎందుకు ఈ అత్యుత్సాహం ప్రదర్శించారు అనేది ఇక్కడ పాయింట్.
గెలిచిన కొత్తలో కాస్త ఇండివిడ్యువల్ గా ప్రవర్తించిన రాపాక… సడన్ గా జగన్ భజన మొదలుపెట్టారు. ఆ సమయంలో పవన్.. రాపాకకు హెచ్చరికలు జారీచేశారా, లేదా అనేది బయటకు రాలేదు. పవన్ నిజంగా రాపాకపై సీరియస్ అయ్యి ఉంటే.. ఆ సీరియస్ ని రాపాక సీరియస్ గా తీసుకుని ఉంటే.. నేడు ఇలా చేసి ఉండేవారు కాదనేది ఒకమాట! లేదా… ఎలాగూ బీజేపీతో మంచి రిలేషన్ షిప్ ఉంది కాబట్టి.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదాము.. అలాంటప్పుడు ఎమ్మెల్యేతో ఏమిపనిలే అని పవన్ లైట్ తీసుకుంటున్నారేమో అనేది రెండో మాట! ఎలా చూసినా రాపాక, పవన్ ని లైట్ తీసుకున్నారని అంటున్నాయి రాజకీయ వర్గాలు.
పవన్ ను రాపాక ఎంత లైట్ తీసుకోకపోతే… జగన్ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా.. రాజోలు నియోజకవర్గంలో సఖినేటిపల్లి, మల్కీపురం, రాజోలు, తాటిపాక వంటి నియోజకవర్గంలోని ప్రధాన సెంటర్లలో భారీస్థాయిలో ఫ్లెక్సీలు పెట్టి, జగన్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తారు అనేది మరో ప్రశ్న!
మొన్న అసెంబ్లీలో అయినా, నిన్న జగన్ మొదటి ఏడాది సందర్భంగా అయినా, నేడు రాజ్యసభ ఎన్నికల విషయంలో అయినా… ఇలా ప్రతీ విషయంలోనూ రాపాక… పవన్ ని లైట్ తీసుకుంటున్న్నారనే విషయంలో ఎలాంటి అనుమానం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో పవన్ కు క్రమశిక్షణ చర్యలు తీసుకునేటంత ధైర్యం లేదనేది మరికొందరి అభిప్రాయంగా ఉంది!
ఈ విషయంలో పక్క జిల్లా ఎంపీని ఏమైనా ఆదర్శంగా తీసుకుని.. సస్పెండ్ చేయించుకుని స్వాత్రంత్రుడు కావాలని రాపాక ఏమైనా ఆలోచిస్తున్నారా.. అందుకే పవన్ ను అస్తమానం గిళ్లుతున్నారా అనే విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. దీనికి సమాధానంగా… ఇప్పుడు మాత్రం రాపాక స్వతంత్రుడు కాదేంటి అనే మాటలు వినిపిస్తున్నాయి.