బలహీనపడిన ’జవాద్‘ తుఫాన్… ఏపీకి తప్పిన ముప్పు.

ఏపీకి పెనుముప్పు తప్పింది. ఉత్తరాంధ్రను కలవర పెట్టిను తుఫాన్ దిశను మార్చుకుని ఒడిశా తీరం వైపు వెళ్లుతోంది. తుఫాన్ గా ఉన్న జవాద్  ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు తీవ్ర అల్పపీడనంగా బలహీన పడింది. విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 180 కిలోమీటర్ల దూరంలో, ఒడిశా గోపాల్‌పూర్‌కు 260 కి.మీ దక్షిణంగా, పూరీకి 330 కి.మీ దక్షిణ-నైరుతి దిశలో, పారాదీప్ కు 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీక్రుతం అయి ఉంది. రేపు పూరీ తీరాన్ని తాకవచ్చని ఐఎండీ తెలిపింది. పశ్చిమ బెంగాల్ వద్ద మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ వెల్లడించింది.

గత కొన్ని రోజులుగా ఉత్తరాంధ్ర, కోస్తా ప్రజల్ని భయపెడుతున్న తుఫాన్ జవాద్ దిశను మార్చుకోవడంతో ఈ ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా నిన్నటి వరకు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో జవాద్ తీరం దాటుతుందని అంచానా వేసినప్పటికీ.. దిశ మార్చుకుని ఉత్తరం వైపు కదలడంతో పెనుముప్పు తప్పింది. ప్రస్తుతం అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.