రివర్స్ బ్యాక్ : జనసేన వైపు చూస్తున్న జేడీ ?

జేడీ లక్ష్మీనారాయణ ! ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఆయన విచారణ అధికారిగా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారడంతో పాటు ,జగన్ 16 నెలల పాటు జైలు జీవితం గడిపేలా చేశారు. ఇక ఆ తర్వాత ఆయన మహారాష్ట్ర కేడర్ కు వెళ్లిపోవడం, ఆ తర్వాత రాజీనామా చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక ఆ తర్వాత ఆయన సొంతంగా ఓ రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు అంటూ హడావుడి ఎంతో నడిచింది అయితే ఆయన పార్టీ స్థాపించేందుకు ప్రయత్నించడం, చివరి నిముషంలో వాయిదా వేసుకుని , ఎన్నికల ముందు హడావుడిగా జనసేన పార్టీలో ఆయన చేరిపోయారు.

విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి బలమైన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లకు గట్టిపోటీ ఇవ్వగలిగారు. అయితే ఆ ఎన్నికల్లో అనూహ్యంగా ఆయన ఓటమి చెందడం తో అంతా షాక్ అయ్యారు. ఆ తర్వాతి పరిణామాల్లో జనసేనకు జేడీకి మధ్య గ్యాప్ పెరిగిపోవడం, పవన్ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం బిజెపితో పొత్తు పెట్టుకునే విషయంలో జేడీ ని కనీసం సంప్రదించక పోవడం ఇలా ఎన్నో పరిణామాలతో, ఆయన ఆ పార్టీని వీడారు. అయితే అప్పటి నుంచి ఆయన ఏ పార్టీలోనూ చేరకుండా విశాఖ కేంద్రంగా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఒక దశలో ఆయన బిజెపి గూటికి వెళతారని వార్తలు వచ్చినా, ఆయనకు సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు.

అయితే ఇప్పుడు బిజెపి జనసేన బంధం బలపడడం బిజెపి లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మార్పులు చోటుచేసుకోవడం, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు యాక్టివ్ గా ఉంటూ, పార్టీని పటిష్టం చేస్తూ ఉండటం, బీజేపీ ఏపీ ఇంచార్జీ సునీల్ దియోధర్ ప్రతి విషయంలోనూ పవన్ ను సంప్రదిస్తూ రాజకీయం గా ముందుకు వెళ్లేందుకు పవన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఇలా ఎన్నో అంశాలను పరిణామాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన జనసేన లోకి వచ్చేందుకు, రాజకీయంగా తనకు ఏ ఇబ్బందీ లేకుండా చేసుకునేందుకు, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది . అయితే ఇక్కడే జేడీ ఓ మెలిక పెట్టారట. రాబోయే ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి అభ్యర్ధిగా తనకే అవకాశం కల్పిస్తాను అనే హామీ ఇవ్వాలి అంటూ షరతు విధించినట్లు తెలుస్తోంది.