సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ త్వరలో లోక్‌సత్తా పార్టీ పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కొత్త పార్టీ ఏర్పాటు పై తీవ్ర కసరత్తు చేసిన ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో ఆయన లోక్‌సత్తాలో అధ్యక్ష పదవి స్వీకరించబోతున్నట్లు సమాచారం. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని ప్రియదర్శిని హాల్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే సమావేశంలో దీనిపై అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
రాజకీయాల్లో సమూలమైన మార్పులు రావాలని ఆశించి ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పర్యటించిన విషయం తెలిసిందే. వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించారు. అయితే కొత్త పార్టీ పేరుగా జనధ్వని అనే పేరును కూడా పరిశీలించారు. కొద్ది మంది మేధావులు.. ప్రముఖుల సలహాలు.. సూచనలతో కొత్త పార్టీ ఏర్పాటు చేయడం కంటే.. లోక్‌సత్తా వంటి పార్టీలో చేరి దాన్ని నడిపించడం మేలనే భావనకు తాజాగా వచ్చారు. దీనిపై లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణతో సంప్రదింపులు జరిపారు.